జగన్మోహన్ రాజుతో స్థానిక ఎన్నికలు గెలవలేం.. హైకమాండ్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు!

Jagan Raju TDP

499

అమరావతి, జూలై 21: రాజంపేట టీడీపీలో నెల రోజులుగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు మంగళవారం పార్టీ అధిష్ఠానం దృష్టికి చేరినట్లు సమాచారం. నియోజకవర్గ ఇన్‌చార్జి జగన్మోహన్ రాజు వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, స్థానిక ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో విజయం సాధించడం కష్టమని పలువురు నాయకులు, కార్యకర్తలు పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాజంపేట నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలకు చెందిన సుమారు 200 మంది నాయకులు, కార్యకర్తలు సమావేశానికి హాజరయ్యారు. అనంతరం రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుఖవాసి ప్రసాద్‌బాబు సూచన మేరకు జోనల్ కోఆర్డినేటర్ దామచర్ల సత్య నివాసానికి వెళ్లి తమ అభ్యంతరాలను వివరించినట్లు సమాచారం.

సమావేశంలో ఒంటిమిట్ట మండలానికి చెందిన నాయకులు ముందుగా తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గ ఇన్‌చార్జి జగన్మోహన్ రాజు వ్యవహారశైలి అహంకారపూరితంగా మారిందని, నాయకులను అవమానించేలా ప్రవర్తిస్తున్నారని, సోషల్ మీడియా వేదికగా పార్టీ నియమాలకు విరుద్ధంగా ఆడియో, వీడియో క్లిప్పింగ్‌లు ప్రచారం చేయించడం ద్వారా పార్టీని రెండు వర్గాలుగా విభజించారని ఆరోపించినట్లు సమాచారం. రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అందరూ కలిసికట్టుగా పనిచేయాలని జోనల్ కోఆర్డినేటర్ సూచించగా, ముందుగా జగన్ రాజు పార్టీ నాయకులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని పలువురు నేతలు గట్టిగా డిమాండ్ చేసినట్లు తెలిసింది.

అదేవిధంగా, సుండుపల్లె ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇసుక సిండికేట్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆ వ్యవహారం ద్వారా భారీ స్థాయిలో అక్రమ ఆదాయం వస్తోందని కొందరు నేతలు జోనల్ కోఆర్డినేటర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అలాగే రాజంపేట పట్టణంలో ప్రభుత్వ ఆదాయం వచ్చే భూ సంబంధిత వ్యవహారాల్లో కూడా జగన్ రాజు అనుచరులు జోక్యం చేసుకుంటూ ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలపై జగన్ రాజు లేదా ఆయన వర్గం నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. పార్టీ అధిష్ఠానం ఈ ఫిర్యాదులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.