గంటలోనే 26 ఫిర్యాదులు.. కమిషనర్ ‘ముఖాముఖీ’కి విశేష స్పందన

Proddatur Commissioner Phone-In Programme

ప్రొద్దుటూరు: ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారానికి ప్రొద్దుటూరు మున్సిపాలిటీ నూతన కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ చేపట్టిన ‘కమిషనర్‌తో ముఖాముఖీ’ ఫోన్-ఇన్ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో కేవలం గంట వ్యవధిలోనే 26 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఫోన్ ద్వారా అందిన ఫిర్యాదుల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల సమస్యలు అధికంగా ఉండగా, మురుగునీటి నిర్వహణ, ట్రాఫిక్, ఆక్రమణలపై కూడా ప్రజలు తమ సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి ఫిర్యాదును కమిషనర్ స్వయంగా నమోదు చేసి, సంబంధిత అధికారులకు వెంటనే పంపించి పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ, దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి హాజరుకావడం కష్టంగా ఉండటంతో వారికి ప్రత్యామ్నాయంగా ఈ ఫోన్-ఇన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజలకు మున్సిపల్ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు అధికారుల్లో జవాబుదారీతనం, పారదర్శకత పెంచడమే దీని ప్రధాన ఉద్దేశమని చెప్పారు.

ప్రతి సోమవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు పీజీఆర్ఎస్‌కు ముందు ‘కమిషనర్‌తో ముఖాముఖీ’ కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మంజునాథ్ గౌడ్, మున్సిపల్ ఇంజనీర్ ఎం. శ్రీనివాసులు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు యశోద, రాజేష్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ కృష్ణ, అసిస్టెంట్ ఇంజనీర్ సురేంద్ర, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఎం. రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మహేష్ పోసా
ప్రొద్దుటూరు
+917337378783