భాను బంధంతో స్థానిక సంగ్రామంలోకి లోకేశ్..?
నడుస్తున్న చరిత్రలో నగరి రాజకీయమెటు..?
నగరి రాజకీయాల్లో రెండున్నరేళ్ల నిశ్శబ్దం ఇప్పుడు క్రమంగా చెదిరిపోతోంది. 2024లో భారీ ఓటమితో వెనక్కి వెళ్లిన మాజీ మంత్రి ఆర్కే రోజా.. మళ్లీ తన రాజకీయ ఉనికిని చాటుకునేందుకు అడుగులు వేస్తుండగా, అదే సమయంలో భారీ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తన విజయాన్ని శాశ్వత రాజకీయ బలంగా మలుచుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. ఒకవైపు కోల్పోయిన పట్టు కోసం రోజా పునరాగమన వ్యూహాలు.. మరోవైపు తండ్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు రాజకీయ వారసత్వాన్ని నిలబెడుతూ తనకంటూ కొత్త ముద్ర వేసుకునే ప్రయత్నంలో భానుప్రకాష్.. నగరి రాజకీయ సమీకరణాలను మరోసారి కదిలిస్తున్నాయి. దీనికి తోడు గత ఎన్నికల మాటల యుద్ధం, లోకేశ్ యువగళం సమయంలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, వైసీపీలోని అంతర్గత విభేదాలు, టీడీపీ శిబిరంలోని స్థానిక సమీకరణాలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. స్థానిక ఎన్నికల గడియారం మోగే కొద్దీ ఈ పోరు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. రోజా పాత బలగాన్ని తిరిగి కూడగట్టగలరా? భానుప్రకాష్ తాజా విజయాన్ని సంస్థాగత పునాదిగా మార్చగలరా? మాటల వేడి గెలుస్తుందా.. పనితీరు ప్రభావం చూపుతుందా? నగరి రాజకీయాల్లో అసలు సంగ్రామం ఇప్పుడే మొదలైందా?











