Home AP పంటలకు విలువ.. రైతులకు సంపద ఫుడ్ ప్రాసెసింగ్‌తో రైతులకు లాభం

పంటలకు విలువ.. రైతులకు సంపద ఫుడ్ ప్రాసెసింగ్‌తో రైతులకు లాభం

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా విలువ జోడించి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నూజివీడు సమీపంలోని ముసునూరులో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో కలిసి దేశీయ నాన్‌-జీఎంఓ హైబ్రీడ్ పాప్‌కార్న్ మొక్కజొన్న విత్తనాలను విడుదల చేశారు. అనంతరం దేశంలోనే అతిపెద్ద పాప్‌కార్న్ ప్రాసెసింగ్ యూనిట్‌ను పరిశీలించారు. 17,500 మంది రైతులు 40 వేల ఎకరాల్లో నాన్‌-జీఎంఓ హైబ్రీడ్ మొక్కజొన్న సాగు చేస్తున్నారని సీఎం తెలిపారు. దేశ పాప్‌కార్న్ ఉత్పత్తిలో గార్మె సంస్థకు 70 శాతం వాటా ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడిన పాప్‌కార్న్ సంపద ఇక దేశంలోనే ఉండేలా చూడాలని, ఆంధ్రా పాప్‌కార్న్‌ను ఆసియా మార్కెట్లతో పాటు ప్రపంచ మార్కెట్లకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అరకు కాఫీ, కోస్తా కోకో, పసుపు, మిరప, మొక్కజొన్న, ఆక్వా ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండింగ్ తీసుకొచ్చి గ్లోబల్ ఉత్పత్తులుగా అభివృద్ధి చేయాలని అన్నారు.

ప్రాసెసింగ్ పెరిగితే సంపద పెరుగుతుంది

రాష్ట్రంలో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న వ్యవసాయ ఉత్పత్తుల్లో కేవలం 10 శాతం మాత్రమే ప్రాసెసింగ్ జరుగుతోందని, ఈ స్థాయిని పెంచితే రైతులకు అధిక ఆదాయం, రాష్ట్రానికి మరింత సంపద లభిస్తుందని చంద్రబాబు తెలిపారు. యువత ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి రావాలని, ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆకాంక్షించారు. వచ్చే 20–30 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా పంటల సాగు, ఆర్థిక వ్యవస్థను ఇప్పటి నుంచే ప్రణాళిక చేసుకోవాలని అన్నారు. రాయలసీమను ఉద్యాన పంటల హబ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని, రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులతో ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రూ.35 వేల కోట్లతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వెల్లడించారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలించి పంటలను కాపాడామని తెలిపారు. చింతలపూడి, వెలిగొండ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు గోదావరి–కృష్ణా, తుంగభద్ర–పెన్నా–కావేరీ నదుల అనుసంధానానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. నీటి భద్రతతో పాటు పంటలకు విలువ జోడిస్తే రైతులు ఆర్థికంగా బలపడతారని చంద్రబాబు స్పష్టం చేశారు.

 

#AndhraPradesh #ChandrababuNaidu #FoodProcessing #APAgriculture #Farmers #FarmerIncome #Agriculture #ValueAddition #AgriculturalExports #NonGMOCorn #Popcorn #PopcornProcessing #Nuzvid #Musunuru #ArakuCoffee #Cocoa #Turmeric #Chilli #Maize #Aquaculture #Rayalaseema #Horticulture #GlobalMarkets #APDevelopment #FarmerWealth