Home AP పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం

పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం

డిప్యూటీ సీఎం పవన్ చొరవతో పనులు వేగం

పులివెందుల నియోజకవర్గ ప్రజల ఏళ్లనాటి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మెగా వాటర్ గ్రిడ్ పథకం పనులు వేగంగా సాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురై నిలిచిపోయిన ఈ పథకంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టడంతో పనులు మళ్లీ గాడిలో పడ్డాయి. జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధారల కింద సుమారు రూ.280 కోట్ల నిధులు కేటాయించి పనులను వేగవంతం చేశారు. ఏడు మండలాల పరిధిలో సుమారు ఐదున్నర లక్షల మందికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 96 శాతం పనులు పూర్తయ్యాయి. పులివెందుల పట్టణం, గ్రామీణ ప్రాంతాలు, సింహాద్రిపురం మండలాల్లో పనులు 100 శాతం పూర్తయ్యాయి. జల్ జీవన్ మిషన్ గడువు ముగిసిన నేపథ్యంలో కేంద్రం నుంచి మరో నాలుగేళ్ల పొడిగింపు సాధించడం ద్వారా పథకానికి తిరిగి ఊపిరి పోసినట్లు అధికారులు తెలిపారు.

తుది దశకు పైప్‌లైన్లు, ప్లాంట్లు

పథకంలో కీలకమైన పనులు ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి. 1,111 కిలోమీటర్ల పైప్‌లైన్‌కు గాను 1,106 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది. ఇంటేక్ వెల్ పునరుద్ధరణ పూర్తవగా, 65 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి శుద్ధి ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. ఓవర్‌హెడ్ ట్యాంకులు, గ్రౌండ్ లెవల్ రిజర్వాయర్ల నిర్మాణం కూడా దాదాపు పూర్తయ్యింది. లింగాల మండల పరిధిలోని 27 ఆవాసాల్లో 24 ఆవాసాలకు త్వరలో తాగునీరు సరఫరా చేయనున్నారు. మొత్తం ప్రాజెక్టు పనులు 96 శాతం, పైప్‌లైన్ నిర్మాణం 99 శాతం పూర్తవడంతో పులివెందుల ప్రజలకు శాశ్వత తాగునీటి భరోసా దగ్గరపడింది. రాజకీయాలకు అతీతంగా ప్రజల ప్రాథమిక అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గ్రామీణ తాగునీటి సరఫరా అధికారులు మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు.

 

#Pulivendula #PulivendulaWaterProject #PawanKalyan #MegaWaterGrid #DrinkingWater #AndhraPradesh #APWaterProjects #JalJeevanMission #AmarajeeviJaldhara #WaterGrid #WaterSupply #WaterInfrastructure #Kadapa #PulivendulaConstituency #RuralDevelopment #WaterTreatmentPlant #PipelineProject #APDevelopment #AndhraPradeshGovernment #PublicWelfare