రూ.15 వేల కోట్ల పెట్టుబడికి బిగ్ డీల్.
ఎండీఎల్‌కు చంద్రబాబు స్వాగతం.
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో కీలక ముందడుగు పడింది. దుగరాజపట్నంలో ఆధునిక గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ ఏర్పాటు చేసేందుకు మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఎండీఎల్, నేషనల్ షిప్‌బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్–ఏపీ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. వచ్చే 5–7 ఏళ్లలో సుమారు రూ.15,000 కోట్ల పెట్టుబడి పెట్టే ప్రతిపాదన ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా దాదాపు 45 వేల ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది.
సముద్ర రంగానికి కొత్త ఊపు
దుగరాజపట్నం ప్రాజెక్టును ఏపీకి చెందిన విస్తృత షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌కు యాంకర్ షిప్‌యార్డ్‌గా అభివృద్ధి చేయనున్నారు. ప్రతిపాదిత యార్డుకు ఏడాదికి 12 లక్షల గ్రాస్ టన్నుల డిజైన్ సామర్థ్యం ఉంటుంది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంది. ట్యాంకర్లు, బల్క్ క్యారియర్లు, కంటైనర్ నౌకలు, ఎల్ఎన్‌జీ క్యారియర్లు వంటి భారీ వాణిజ్య నౌకల తయారీకి ఈ కేంద్రం వేదిక కానుంది. షిప్‌బిల్డింగ్‌తో పాటు షిప్ రిపేర్, మెరైన్ ఇంజినీరింగ్, తయారీ, లాజిస్టిక్స్ రంగాల్లో అనుబంధ పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉంది.
2047 లక్ష్యంపై చంద్రబాబు ఫోకస్
చంద్రబాబు తన పోస్ట్‌లో ఎండీఎల్‌ను ఏపీకి స్వాగతిస్తూ, రాష్ట్ర సముద్రతీరం, వ్యూహాత్మక భౌగోళిక స్థానం, పారిశ్రామిక వ్యవస్థను ఉపయోగించుకుని 2047 నాటికి ప్రపంచంలోని టాప్-5 షిప్‌బిల్డింగ్ దేశాల్లో భారత్ నిలవాలనే లక్ష్యంలో ఏపీ ముందుండాలని పేర్కొన్నారు. దుగరాజపట్నం క్లస్టర్ ద్వారా భారీ పెట్టుబడులు, అనుబంధ పరిశ్రమలు ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ప్రపంచస్థాయి షిప్‌బిల్డింగ్ హబ్‌గా మార్చేందుకు ఎండీఎల్‌కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.











