Home Telangana నిర్మాణాలే లేవు.. రూ.500 కోట్ల రుణమెలా?

నిర్మాణాలే లేవు.. రూ.500 కోట్ల రుణమెలా?

ఫ్యాబ్‌సిటీ భూముల రుణాలపై విమర్శలు .
భూముల వివాదంలో బ్యాంకు రుణంపై ప్రశ్నలు.
దర్యాప్తుకు సీబీఐని రంగంలోకి దించిన కోర్టు.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని ఫ్యాబ్‌సిటీ భూముల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటు కోసం కేటాయించిన భూమిలో ఆశించిన స్థాయిలో నిర్మాణాలు చేపట్టకపోయినా, సెమ్ ఇండియా ఫ్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎస్‌బీఐ రూ.500 కోట్ల రుణం ఎలా మంజూరు చేసిందని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. రుణం ఇచ్చే ముందు సంస్థ ఆదాయ వనరులు, తిరిగి చెల్లించే సామర్థ్యం, ప్రాజెక్టు పురోగతిని పరిశీలించాల్సిన బాధ్యత బ్యాంకుకు లేదా అని జస్టిస్ నగేశ్ భీమపాక విస్మయం వ్యక్తం చేశారు. కేవలం తనఖా, పూచీకత్తు ఆధారంగా ఇంత భారీ రుణం ఇవ్వడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు.

ఎస్‌బీఐ వాదనపై కోర్టు సందేహాలు

2006లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెమ్ ఇండియాతో ఒప్పందం చేసుకోగా, 2007లో సెమీకండక్టర్ పరిశ్రమ కోసం 100 ఎకరాలను 66 ఏళ్ల లీజుకు కేటాయించింది. ప్రాజెక్టులో పురోగతి లేకపోవడంతో 2010లో ప్రభుత్వం 78 ఎకరాలను వెనక్కి తీసుకుంది. మిగిలిన 22 ఎకరాలను సవరించిన నిబంధనలతో కంపెనీకి కొనసాగించింది. ప్రభుత్వ ఎన్‌ఓసీల ఆధారంగా 2011లో సుమారు రూ.500 కోట్ల రుణం ఇచ్చామని, ఆగస్టు 20న భూమిపై తనఖా హక్కులు పొందామని ఎస్‌బీఐ చెబుతోంది. అయితే 2010లోనే భూమిని వెనక్కి తీసుకుంటే, 2011లో రుణం ఎలా ఇచ్చారన్నది న్యాయస్థానం ప్రధానంగా లేవనెత్తిన ప్రశ్న.

సీబీఐకి బాధ్యత.. డిసెంబర్ 4న తదుపరి విచారణ

భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన లేఖను సవాల్ చేస్తూ ఎస్‌బీఐ హైకోర్టును ఆశ్రయించింది. రికార్డులను పరిశీలించిన న్యాయమూర్తి బ్యాంకు తగిన జాగ్రత్తలు తీసుకుందా అనే అంశంపై సందేహాలు వ్యక్తం చేశారు. వ్యవహారంపై సమగ్ర పరిశీలన అవసరమని భావించి సీబీఐని సుమోటోగా ప్రతివాదిగా చేర్చారు. కేసుకు సంబంధించిన పూర్తి పత్రాలు, గతంలో కంపెనీ దాఖలు చేసిన వ్యాజ్యం, సంబంధిత కోర్టు ఉత్తర్వుల ప్రతులను సీబీఐ న్యాయవాదికి వెంటనే అందించాలని రిజిస్ట్రీని ఆదేశించారు. తదుపరి విచారణను డిసెంబర్ 4కు వాయిదా వేశారు. రూ.500 కోట్ల రుణం మంజూరు వెనుక బ్యాంకు అనుసరించిన విధానాలపై ఇప్పుడు సీబీఐ పరిశీలన కీలకంగా మారనుంది.

 

#TelanganaFabCity #FabCityLandDispute #SemIndiaFab #SBI #500CroreLoan #TelanganaHighCourt #CBI #Maheshwaram #Raviryala