ఉద్యమ వేదికగా.. జనతా గ్యారేజ్గా గుర్తింపు
బీఆర్ఎస్ తెలంగాణ భవన్ ప్రారంభమై సరిగ్గా 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. స్వరాష్ట్ర ఆకాంక్షను చాటేలా, తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వాన్ని నిలబెట్టేలా తెలంగాణ భవన్ నిలిచిందని పేర్కొన్నారు. ఉద్యమకారులకు ఒక వేదికగా తెలంగాణ భవన్ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో వ్యూహాలు, ప్రతివ్యూహాల రూపకల్పనకు ఈ భవన్ వేదికగా నిలిచిందని కేటీఆర్ గుర్తుచేశారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత దశాబ్ద కాలం తెలంగాణ సాధించిన అభివృద్ధి ప్రస్థానానికి తెలంగాణ భవన్ సాక్ష్యంగా నిలిచిందని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజా సమస్యలపై పోరాడేందుకు తెలంగాణ భవన్ ఒక ‘జనతా గ్యారేజ్’లా మారిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌ను ‘తెలంగాణ భువన విజయం’గా అభివర్ణిస్తూ ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలంగాణ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
నాడు ఉద్యమ వేదిక.. నేడు ప్రజల అండ
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా తెలంగాణ భవన్ రెండు దశాబ్దాల ప్రస్థానాన్ని గుర్తుచేశారు. నాడు స్వరాష్ట్ర పోరులో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ వేదికగా తెలంగాణ భవన్ నిలిచిందని చెప్పారు. నేడు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల కొండంత అండతో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే అసలైన ‘జనతా గ్యారేజ్’గా మారిందని పేర్కొన్నారు. తెలంగాణ భవన్ కేవలం పార్టీ కార్యాలయం కాదని, రాష్ట్ర ఉద్యమ చరిత్రతో ముడిపడిన ఆత్మగౌరవ సూచికగా నిలిచిందని హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. రెండు దశాబ్దాల ప్రస్థానంలో ఉద్యమం నుంచి అధికార పీఠం వరకు, అక్కడి నుంచి ప్రధాన ప్రతిపక్ష పాత్ర వరకు తెలంగాణ భవన్ రాజకీయ పరిణామాలకు వేదికగా నిలిచిందని బీఆర్ఎస్ నేతలు గుర్తుచేశారు. 20 ఏళ్ల తెలంగాణ భవన్ ప్రస్థానాన్ని ఉద్యమ స్ఫూర్తికి ప్రతీకగా అభివర్ణిస్తూ పార్టీ శ్రేణులు ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నాయి.
#TelanganaBhavan #BRS #KTR #HarishRao #TelanganaMovement #TelanganaStatehood #TelanganaPolitics #BRSHistory #TelanganaBhavan20Years #JanataGarage #TelanganaNews #TelanganaFormation











