స్థానిక ఎన్నికల వేళ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేనలో సీట్ల అంశం హాట్‌టాపిక్‌గా మారింది. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ఐక్యతతో ముందుకు సాగాలని సూచిస్తున్నా.. కొందరు నేతలు మాత్రం తమదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అమలాపురం నియోజకవర్గ జనసేన నేతలతో నిర్వహించిన సమావేశం ఆసక్తిని రేపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సమన్వయం, అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయి కార్యాచరణపై ప్రధానంగా చర్చించాల్సిన సమయంలో.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 50 నుంచి 60 స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని బొలిశెట్టి వ్యాఖ్యానించారు. జనసేన బలాన్ని ఇప్పటి నుంచే పెంచుకోవాలని కార్యకర్తలు, నేతలకు పిలుపునిచ్చారు. కాపులు బలంగా ఉన్న జిల్లాల్లో పార్టీ పట్టు మరింత పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. దీంతో స్థానిక ఎన్నికల కంటే మూడేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలపై బొలిశెట్టి దృష్టి పెట్టడం చర్చనీయాంశమైంది.
టీడీపీపై ఒత్తిడి ఆరోపణలు
మరోవైపు టీడీపీ నుంచి తమ క్యాడర్‌కు ఎదురవుతున్న ఒత్తిడిని బొలిశెట్టి బహిరంగంగానే ప్రస్తావించారు. టీడీపీ నేతలు జనసేన క్యాడర్‌ను తొక్కేస్తున్నారని ఆరోపించారు. జనసేన నేతలు టీడీపీ నాయకులను గౌరవిస్తున్నా.. తమ కార్యకర్తలకు మాత్రం తగిన గౌరవం దక్కడం లేదని అన్నారు. ఈ విషయం పవన్ కల్యాణ్‌కు కూడా తెలుసని, కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో సీఎం చంద్రబాబుతో పవన్ మాట్లాడతారని కార్యకర్తలకు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల కోసం జనసేన నేతలు చేస్తున్న డిమాండ్లపైనా బొలిశెట్టి ఘాటుగా స్పందించారు. “నేను చెబితే మీకు సీటు రాదు.. టికెట్ ఇప్పించేంత అర్హత నాకు లేదు” అంటూ స్పష్టం చేశారు. ఎవరైనా సరే తాను వాస్తవమే మాట్లాడతానని, ఎవరికీ భయపడనని తేల్చిచెప్పారు. వరుస హాట్ కామెంట్లతో ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైన బొలిశెట్టి తాజా వ్యాఖ్యలు.. జనసేన-టీడీపీ కూటమిలో స్థానిక స్థాయి సమన్వయం, సీట్ల పంపకాలపై కొత్త చర్చకు తెరతీశాయి.
#BolishettiSrinivas #JanaSena #JanaSenaSeats #JanaSenaSeatSharing #PawanKalyan #TDP #TDPJanaSenaAlliance #APPolitics #APLocalElections #JanaSenaNews #BolishettiSrinivasComments #SeatSharing #JanaSena50Seats #AndhraPradeshPolitics #PoliticalNews











