Home AP మెగా డీఎస్సీపై జగన్‌ విషం చిమ్ముతున్నారు

మెగా డీఎస్సీపై జగన్‌ విషం చిమ్ముతున్నారు

16 వేల పోస్టుల ఘనత కూటమిదన్న లోకేశ్.

ఏపీ మెగా డీఎస్సీపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ చేస్తున్న విమర్శలకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. మెగా డీఎస్సీపై జగన్‌ విషం కక్కడం బాధాకరమని అన్నారు. శుక్రవారం తన ఎక్స్‌ ఖాతాలో వీడియో విడుదల చేసిన లోకేశ్‌.. త్వరలోనే మరో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ప్రకటించారు. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి ఉన్న తేడా జగన్‌కు తెలుసా అని ప్రశ్నించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్‌ పోస్టు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు తొలి సంతకం డీఎస్సీపైనే చేశారని గుర్తు చేశారు. తాజా మెగా డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. డీఎస్సీ ప్రక్రియను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు సుమారు 300 కేసులు వేశారని లోకేశ్‌ ఆరోపించారు. అయితే ఈ కేసుల విచారణ సమయంలో ప్రభుత్వాన్ని కోర్టులు తప్పుపట్టలేదని స్పష్టం చేశారు.

ఆరోపణలకు ఆధారాలతో సమాధానం

డీఎస్సీ ప్రక్రియపై వచ్చిన ప్రతి ఆరోపణకు అధికారులు ఆధారాలతో సమాధానం ఇచ్చారని లోకేశ్‌ తెలిపారు. టీచర్లపై ఒత్తిళ్లు, దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ఇదే సమయంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును ప్రస్తావిస్తూ గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని 53 రోజులు జైలులో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో మూడేళ్లపాటు న్యాయ ప్రక్రియ కొనసాగిందని చెప్పారు. తాజాగా ఆ లీగల్‌ ప్రాసెస్‌ పూర్తయిందని, చంద్రబాబుకు క్లీన్‌చిట్‌ వచ్చిందని లోకేశ్‌ పేర్కొన్నారు. మెగా డీఎస్సీ విషయంలో రాజకీయ విమర్శలకంటే ప్రభుత్వం చేపట్టిన నియామకాలు, ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై వాస్తవాలను ప్రజలు గమనించాలని సూచించారు. టీచర్‌ నియామకాల్లో కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలను స్పష్టంగా వివరించేందుకే తన వీడియో ద్వారా జగన్‌ విమర్శలకు సమాధానం ఇచ్చినట్లు లోకేశ్‌ పేర్కొన్నారు.

#NaraLokesh #MegaDSC #APDSC #DSCRecruitment #16000TeacherPosts #TeacherRecruitment #APTeacherJobs #JaganMohanReddy #ChandrababuNaidu #TDP #TDPGovernment #APEducation #AndhraPradeshPolitics #APPolitics #DSCNotification