డ్రగ్స్ నుంచి రోడ్డు ప్రమాదాల వరకు.
కలెక్టర్ల సదస్సులో సీఎం ఫుల్ క్లారిటీ.
ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్, మహిళలపై అఘాయిత్యాలు, రోడ్డు ప్రమాదాలను కట్టడి చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ‘త్రిశూల్’ వ్యూహాన్ని ప్రకటించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి ‘జీరో డ్రగ్స్, మహిళలపై అఘాయిత్యాలకు జీరో టాలరెన్స్, జీరో రోడ్డు ప్రమాదాలు’ లక్ష్యంగా పనిచేయాలని పోలీస్ శాఖ, జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అమరావతిలో జరిగిన 8వ కలెక్టర్ల సదస్సు ముగింపు సమావేశంలో శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించిన సీఎం.. ప్రతి అంశానికి కాలపరిమితితో కూడిన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాపై మరింత కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలకు ప్రత్యేక క్యాలెండర్ రూపొందించాలని ఆదేశించారు. విశాఖపట్నం, తిరుపతి, అమరావతిలో డీ-అడిక్షన్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర కంటెంట్, డిజిటల్ వేదికల ద్వారా జరుగుతున్న వ్యవస్థీకృత వేధింపులపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు.
కేసుల దర్యాప్తులో వేగం పెరగాలి
నేర ఘటనలు జరిగిన వెంటనే పోలీసులు స్పందించాలని చంద్రబాబు ఆదేశించారు. క్రైమ్ సీన్‌కు 30 నిమిషాల్లో పోలీసులు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి రోడ్డు ప్రమాదాన్ని ఆడిట్ చేసి కారణాలను గుర్తించాలని, అంబులెన్స్ చేరుకునే సమయాన్ని కూడా విశ్లేషించాలని చెప్పారు. దేశంలో రోడ్డు ప్రమాదాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని పేర్కొన్న సీఎం.. గత రెండేళ్లలో రాష్ట్రంలో నేరాలు 14 శాతం తగ్గాయని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 29.2 శాతం తగ్గాయని తెలిపారు. ప్రస్తుతం 47 శాతంగా ఉన్న శిక్షల రేటును మెరుగైన ఆధారాల సేకరణ, భద్రపరిచే విధానంతో 70 నుంచి 80 శాతానికి పెంచవచ్చని అన్నారు. ప్రాంతీయ ఫోరెన్సిక్ ల్యాబ్‌లు, అదనపు డాగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. కోర్టుల్లో పెండింగ్ కేసులపై నిఘా కోసం ‘వన్ కోర్టు–వన్ కానిస్టేబుల్’ విధానాన్ని అమలు చేయాలని చెప్పారు. కీలక కేసుల్లో ప్రస్తుతం ఆరు గంటలు పడుతున్న డీఎన్‌ఏ పరీక్ష సమయాన్ని మరింత తగ్గించాలని ఆదేశించారు.
ప్రజలకు ఇబ్బంది లేకుండా పాలన
శాంతిభద్రతల విషయంలో పోలీసులు కఠినంగా ఉంటూనే ప్రజలకు స్నేహపూర్వకంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. వీఐపీ పర్యటనల సమయంలో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని, తన కాన్వాయ్ వచ్చే 15 నిమిషాల ముందే ట్రాఫిక్ నిలిపివేయొద్దని స్పష్టం చేశారు. పెట్టుబడి ఒప్పందాలు ప్రభుత్వం చేసుకున్నా వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదేనన్నారు. “పెట్టుబడి ఆలస్యమైతే ఉపాధి ఆలస్యం” అని హెచ్చరించారు. అధికారుల నిర్లక్ష్యంతో అభివృద్ధి పనులు ఆగిపోకూడదని, సమీక్షలు కేవలం చర్చలుగా కాకుండా ఫలితాలు ఇచ్చేలా ఉండాలని స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రస్తుత ధరల వద్ద వృద్ధిరేటు 13.44 శాతంగా, జీఎస్టీ ఆదాయం 18 శాతం పెరిగిందని తెలిపారు. 2027 నాటికి 5.32 లక్షల ఇళ్ల నిర్మాణం, 2028 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం వెల్లడించారు.
#ChandrababuNaidu #TrishulStrategy #APTrishulStrategy #AndhraPradesh #APPolice #CrimeControl #ZeroDrugs #WomenSafety #RoadSafety #RoadAccidents #DrugControl #APCollectorsConference #LawAndOrder #APGovernment #APNews











