తెనాలిలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. నాలుగైదు జిల్లాల నుంచి అసాంఘిక శక్తులను తీసుకొచ్చి అలజడి సృష్టించడం ప్రజాస్వామ్య నిరసన కాదని అన్నారు. ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడటం అత్యంత హేయమని వ్యాఖ్యానించారు. కోవిడ్ సమయంలో ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద విధులకు వినియోగించిన చరిత్ర వైసీపీ ప్రభుత్వానిదేనని ఆరోపించారు. డీఎస్సీపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని, ఆధారాలుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని జగన్కు సూచించారు. డీఎస్సీ, ఏపీపీఎస్సీ మధ్య తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
మద్యం వ్యవహారంపై ఆరోపణలు
వైసీపీ హయాంలో మద్యం విక్రయాల్లో భారీ అవినీతి జరిగిందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రూ.1.30 లక్షల కోట్ల మద్యం లావాదేవీలు జరిగితే కేవలం రూ.600 కోట్ల మేరకు మాత్రమే డిజిటల్ చెల్లింపులు నమోదయ్యాయని పేర్కొన్నారు. నాసిరకం మద్యం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారని, మరెందరో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని ఆరోపించారు. మద్యం వ్యవహారంపై ఈడీ దర్యాప్తు వేగం పెరుగుతున్న కొద్దీ ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైసీపీ కొత్త అంశాలను తెరపైకి తెస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామని నాదెండ్ల తెలిపారు.











