Home AP అమరావతిలో వేగంగా భూసమీకరణ

అమరావతిలో వేగంగా భూసమీకరణ

రైతుల సమ్మతితో ప్రక్రియ ముందుకు.
75 శాతం భూముల సమీకరణ పూర్తి.

అమరావతి రాజధాని రెండో విడత భూసమీకరణ ప్రక్రియ వేగం పుంజుకుంది. రాజధాని విస్తరణ, అభివృద్ధి పనులకు అవసరమైన భూములను సమీకరించేందుకు ప్రభుత్వం, ఏపీ సీఆర్డీఏ ప్రత్యేక దృష్టి సారించాయి. పల్నాడు జిల్లా అమరావతి మండలం పెదమద్దూరు గ్రామంలో మొత్తం 1,018 ఎకరాల భూమిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 764.23 ఎకరాలకు రైతులు సమ్మతి తెలిపారు. దీంతో దాదాపు 75 శాతం భూసమీకరణ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. రైతులతో అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ భూసమీకరణ ఉద్దేశాన్ని వివరిస్తున్నారు. రైతుల సందేహాలను నివృత్తి చేస్తూ అంగీకార పత్రాలను స్వీకరిస్తున్నారు.

కౌలు చెల్లింపులతో రైతుల్లో నమ్మకం

భూములు ఇచ్చేందుకు అంగీకరించిన రైతులకు నిబంధనల ప్రకారం వార్షిక కౌలు వెంటనే చెల్లించేలా సీఆర్డీఏ చర్యలు చేపట్టింది. కౌలు ప్రక్రియను వేగవంతం చేయడంతో రైతుల్లో భూసమీకరణపై ఆసక్తి పెరుగుతోందని అధికారులు తెలిపారు. ప్రతిరోజూ పలువురు రైతులు తమ భూములను ల్యాండ్‌ పూలింగ్‌కు ఇచ్చేందుకు సమ్మతి పత్రాలు అందిస్తున్నారు. రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలన్న ఉద్దేశంతో భూములు ఇస్తున్న పెదమద్దూరు రైతులకు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన రైతులు కూడా సహకరించి అమరావతి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. రైతుల ఆర్థిక ప్రయోజనాలకు ఇబ్బంది లేకుండా కౌలు చెల్లింపులు కొనసాగిస్తామని సీఆర్డీఏ స్పష్టం చేసింది.

#Amaravati #AmaravatiLandPooling #APCRDA #AmaravatiCapital #AmaravatiDevelopment #AmaravatiFarmers #LandPooling #Pedamadduru #AndhraPradesh #APCapital #CRDA #CapitalDevelopment #FarmersConsent #AmaravatiLandAcquisition #AmaravatiNews