Home AP లాకప్ మృతిపై అంబటి ఆగ్రహం – సాయికృష్ణ కేసులో సీబీఐ విచారణ డిమాండ్

లాకప్ మృతిపై అంబటి ఆగ్రహం – సాయికృష్ణ కేసులో సీబీఐ విచారణ డిమాండ్

50

పవన్ మౌనంపై అంబటి ప్రశ్నల వర్షం
శవం దహనంపై తీవ్ర ఆరోపణలు వెల్లువ

23 ఏళ్ల యువకుడు గాదె సాయికృష్ణను పోలీస్‌ స్టేషన్‌లో దారుణంగా కొట్టి చంపేశారు. ఈ దారుణ హత్యకు పాల్పడిన తర్వాత పోలీసులు ఎలాంటి ఆధారాలు లేకుండా శవాన్ని దహనం చేశారు. ఈ అమానుష ఘటనపై జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పడం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా ప్రశ్నించారు. గుంటూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ లాకప్ డెత్ గురించి మాట్లాడారు. చనిపోయిన యువకుడి మేనమామ నవరంగ్ తన వద్దకు వచ్చి న్యాయం చేయమని వేడుకున్నట్లు అంబటి తెలిపారు. సాయికృష్ణ తల్లి పడుతున్న ఆవేదన, కడుపుకోత చూస్తే ఎవరికైనా తీవ్రమైన బాధ కలుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సాక్ష్యాల మాయం అమానుషం
ఈ ఘోరమైన ఘటనకు రాజకీయ రంగు పులమకూడదని, పార్టీలకు అతీతంగా అందరూ కలిసి దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. దేశ చరిత్రలోనే ఇటువంటి ఘోరమైన అరాచకం ఎక్కడా జరగలేదన్నారు. గతంలో ఎన్నో లాకప్ డెత్‌లు చూశామని, కానీ ఇక్కడ మనిషిని చంపేసి శవాన్ని కూడా మాయం చేయడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు మర్డర్ చేసి సాక్ష్యాలు లేకుండా శవాన్ని కాల్చేశారని ఆరోపించారు. కోర్టులో హెబియస్ కార్పస్ కేసు వేస్తే, పోలీసులు మాత్రం తాము ఇంకా సాయికృష్ణ కోసం వెతుకుతున్నామంటూ అబద్ధాలు చెబుతూ నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విచారణకు అంబటి డిమాండ్
సాయికృష్ణ మృతికి ముమ్మాటికీ పోలీసులే కారణమని, ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించి పూర్తిస్థాయి ఎంక్వయిరీ జరిపించాలని అంబటి డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్‌కు చేతులు జోడించి వేడుకుంటున్నానని, మానవత్వంతో ఆలోచించి తక్షణమే విచారణకు ఆదేశించాలని కోరారు. పోలీస్ స్టేషన్‌లో చంపి కాల్చేయడం చట్టం చేసే పనేనా అని ప్రశ్నించారు. ఇది తమిళనాడులో జరిగిన దారుణాల కన్నా ఘోరమైన ఘటన అని, బాధ్యులైన పోలీసులకు చట్టప్రకారం ఉరిశిక్ష వేయాలన్నారు. కనీసం తన కొడుకు బూడిదనైనా ఇవ్వాలని ఆ తల్లి కోరుతోందని, సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు.

బాధితుడి కుటుంబం ఆవేదన
అనంతరం సాయికృష్ణ మేనమామ నవరంగ్‌ మాట్లాడుతూ ఈ మృతిని రాజకీయ పార్టీలతో ముడిపెట్టడం సరికాదన్నారు. తాను జనసేన కార్యకర్తనైనా, తన మేనల్లుడికి జరిగిన అన్యాయంపై స్పందిస్తున్నానని చెప్పారు. ఆ తల్లి పడుతున్న నరకయాతన చూసి చుట్టుపక్కల ప్రజలందరూ చలించిపోతున్నారన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే పోలీస్ స్టేషన్‌కు పిలిపించి హత్య చేసి దహనం చేయడమేనా అని నిలదీశారు. సాధారణ వ్యక్తి చనిపోతే ప్రభుత్వం స్పందించదా అని అడిగారు. సాయికృష్ణ మంచోడు కాదని పోలీసులు చెప్తున్నారని, మరి అలాంటప్పుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రాణాలు తీసిన పోలీసులు హంతకులు కాదా అని ఆయన కన్నీటితో ప్రశ్నించారు.