Home AP కన్నతల్లి గుండెకోత బూడిదైనా ఇవ్వండి

కన్నతల్లి గుండెకోత బూడిదైనా ఇవ్వండి

50

కన్నీరుమున్నీరవుతున్న సాయికృష్ణ అమ్మ

తన కొడుకు బతికి ఉంటే తన వద్దకు తీసుకురావాలని, లేదంటే కనీసం అతని బూడిదనైనా ఇవ్వాలని సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు దారుణంగా చంపి తగలబెడతారా అని ఆమె ప్రశ్నించారు. ఈ ఘోరానికి రాజకీయాలు అంటగట్టవద్దని, తమకు కేవలం న్యాయం మాత్రమే కావాలని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పోలీసు వ్యవస్థకు వ్యతిరేకం కాదని, కేవలం సీఐ నాగరాజు చేసిన అన్యాయంపైనే పోరాటం చేస్తున్నామని చెప్పారు. సీఐ నాగరాజు గతంలోనే తన కొడుకును చంపేస్తానని బెదిరించాడని ఆమె ఆరోపించారు. స్టేషన్‌లో కుర్రాళ్ళను కొడుతుంటే తట్టుకోలేకపోయానని, తన కొడుకును చూపించమని ఎంత బతిమాలినా పోలీసులు చూపించలేదని కన్నీరు పెట్టారు.

పోలీస్ స్టేషన్‌లో దారుణ హింస
బాబురావు అనే వ్యక్తి తన కొడుకును ఎక్కడికి తీసుకెళ్లాడో సమాధానం చెప్పాలని విజయలక్ష్మి డిమాండ్ చేశారు. తన కొడుకును విపరీతంగా కొట్టి బాత్‌రూమ్‌లో పడేశారని చెప్పారు. కొడుకు ఇంటికి వస్తాడని తాను ఇంకా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. తమకు సపోర్టుగా నిలిచిన వ్యక్తిపై కొందరు తప్పుడు నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ఒక పిల్లోడిని చంపి, దహనం చేసి ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు సీఐ నాగరాజుకు తన కొడుకును చంపే అధికారం, ధైర్యం ఎవరు ఇచ్చారని నిలదీశారు. తమ బిడ్డ ప్రాణాలు తీసి శవాన్ని మాయం చేసిన వారిపై దొంగ రాజకీయాలు చేయవద్దని హెచ్చరించారు.

ప్రశ్నించని పవన్ కళ్యాణ్ వైఖరి
సాయికృష్ణ మేనమామ నవరంగ్ మాట్లాడుతూ తమకు ఎలాగైనా న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. అమ్మిశెట్టి వాసు అనే వ్యక్తి కేవలం రాజకీయాలు చేయడానికి, తమను బెదిరించడానికి ఇక్కడికి వచ్చాడని ఆరోపించారు. తాము పోలీసులకు వ్యతిరేకం కాదని, నాగరాజు చేసిన దారుణమైన అన్యాయంపైనే పోరాడుతున్నామని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు సమాజంలో తప్పు జరిగితే ప్రశ్నిస్తానని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇంత పెద్ద ఘోరం జరిగినా ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో స్టేషన్ సిబ్బంది మొత్తం భాగస్వామ్యులై ఉన్నారని, ప్రభుత్వం సుమోటోగా కేసును స్వీకరించి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

చట్టపరమైన పోరాటానికి లాయర్ సిద్ధం
ఈ ఘటనపై అడ్వకేట్ కనకదుర్గ మాట్లాడుతూ సాయికృష్ణపై కేవలం రెండు చిన్న కేసులు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఆ రెండు కేసుల నెపంతోనే అతడిని స్టేషన్‌కు తీసుకొచ్చి విపరీతంగా కొట్టారని చెప్పారు. సాయికృష్ణకు ఎలాంటి రాజకీయాలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. అధికార పార్టీ నాయకులకు దమ్ముంటే ముందుకు రావాలని, తానేంటో నిరూపిస్తానని సవాల్ విసిరారు. చట్టాన్ని రక్షించాల్సిన వారే హంతకులుగా మారడం దారుణమన్నారు. యువకుడు బతికి ఉంటే అతని మృతదేహాన్ని అప్పగించాలని, లేదంటే కనీసం ఆ తల్లి ఆత్మశాంతి కోసం బూడిదైనా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షించే వరకు న్యాయపోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.