Home AP సంస్కారహీన భాషపైనే నా విమర్శలు

సంస్కారహీన భాషపైనే నా విమర్శలు

47

హోం మంత్రి అనిత వ్యాఖ్యలపై వివరణ
మహిళలకు ఆపాదించొద్దన్న గుడివాడ అమర్నాథ్

తాను మాట్లాడిన మాటలు యావత్ మహిళా లోకాన్ని ఉద్దేశించినవి కావని వైయ‌స్ఆర్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో వైయస్ విజయమ్మ, భారతిలపై అత్యంత నీచంగా మాట్లాడిన హోంమంత్రి అనిత సంస్కారహీన భాషను మాత్రమే తాను ఖండించానని తెలిపారు. మహిళల పట్ల ఉండే గౌరవానికి పార్టీ రంగులతో సంబంధం లేదని చెప్పారు. తన ఇంట్లోని ఆడబిడ్డలైనా, ఎదుటివారి కుటుంబ మహిళలైనా తనకు ఒక్కటే గౌరవమని అన్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు తనకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన ఘాటుగా స్పష్టం చేశారు.

మూడు తరాల ఘనమైన చరిత్ర
తన కుటుంబానికి మూడు తరాలుగా ఘనమైన రాజకీయ చరిత్ర ఉందని గుడివాడ అమర్నాథ్ గుర్తు చేశారు. తాము ఎప్పుడూ అసభ్యంగా మాట్లాడలేదని చెప్పారు. మాజీ మంత్రి అన్న కనీస గౌరవం లేకుండా తనను పట్టుకుని ‘వాడెవడు’ అని అనిత ప్రశ్నించడం ఆమె అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఏ రాజకీయ కుటుంబానికి లేని ఘనమైన చరిత్ర తమ ఇల్లాలు అని తెలిపారు. 1976 నుంచి మూడు తరాలుగా ఈ జిల్లాలో రాజకీయం చేస్తున్నామని చెప్పారు. బాధ్యతాయుతమైన హోంమంత్రి పదవిలో ఉండి ఒక మాజీ మంత్రిని పట్టుకుని ‘వాడెవడు’ అనడం ఆమె సంస్కారానికే వదిలేస్తున్నానని అన్నారు.

తెలుగుదేశం పార్టీ పొలిటికల్ డ్రామా
జూన్ 12న జరిగిన ఒక కార్యక్రమంలో తాను మాట్లాడితే ఆ రోజు నుంచి లేని బాధ తెలుగుదేశం పార్టీ నేతలకు మూడు రోజుల తర్వాత వచ్చిందని అమర్నాథ్ ఎద్దేవా చేశారు. తన మాటలను కేవలం రాజకీయంగా వాడుకోవాలనే దురుద్దేశంతోనే మహిళలు, దళితులు అంటూ కొత్త సెంటిమెంట్లు తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే ఈ అంశాన్ని కూటమి నాయకులు వివాదం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండేళ్ల కూటమి పాలనలో తమ నాయకుడిపై, తమపై చేసిన వ్యక్తిగత, అసభ్యకర ఆరోపణలను ఖండిస్తూనే తాను మాట్లాడానని చెప్పారు. భవిష్యత్తులోనూ ఇలాగే నోరుపారేసుకుంటే ఇదే తరహా సమాధానం ఉంటుందని హెచ్చరించారు.