Home AP విద్యాశాఖకు సింగపూర్‌ శిక్షణ బలం!

విద్యాశాఖకు సింగపూర్‌ శిక్షణ బలం!

టీచర్ల, ఉన్నతాధికారులకు ప్రత్యేక శిక్షణ.
ప్రతి ఉపాధ్యాయుడికీ అంతర్జాతీయ నైపుణ్యం.

ఆంధ్రప్రదేశ్‌ విద్యావ్యవస్థలో బోధనా ప్రమాణాలు పెంచేందుకు సింగపూర్‌ సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. అమరావతిలో జరిగిన మూడో ఏపీ–సింగపూర్‌ జాయింట్‌ ఇంప్లిమెంటేషన్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఆరుగురు మంత్రులు, 37 మంది ఉపాధ్యాయులకు సింగపూర్‌లో ఇచ్చిన శిక్షణ మంచి ఫలితాలిచ్చిందని పేర్కొన్నారు. ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను వేసవి సెలవుల్లో సింగపూర్‌కు పంపించి ఆధునిక బోధనా పద్ధతుల్లో శిక్షణ ఇప్పించాలని సూచించారు. అక్కడ నేర్చుకున్న పాఠాలను తిరిగొచ్చిన టీచర్లు స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాల ద్వారా ఇతర ఉపాధ్యాయులకు అందించాలని ఆదేశించారు. శిక్షణ కొందరికే పరిమితం కాకుండా రాష్ట్రంలోని ప్రతి ఉపాధ్యాయుడికి చేరాలని స్పష్టం చేశారు. విద్యాశాఖలో మార్గదర్శకత్వం, దిశానిర్దేశం, పరిపాలన అనే మూడు అంశాలపై సామర్థ్యాల పెంపునకు చర్యలు తీసుకోవాలని కోరారు.

డిజిటల్‌ పాలన, నాయకత్వ నైపుణ్యాలకు ప్రాధాన్యం

సింగపూర్‌ సహకారాన్ని విద్యాశాఖకే పరిమితం చేయకుండా డిజిటల్‌ గవర్నెన్స్‌, రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌, నైపుణ్యాభివృద్ధి, అధికారుల నాయకత్వ శిక్షణకు విస్తరించాలని లోకేష్‌ కోరారు. మంత్రులు, సంబంధిత శాఖల కార్యదర్శులకు కలిపి శిక్షణ ఇస్తే విధాన నిర్ణయాలు, అమలులో సమన్వయం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. డేటా ఆధారిత నిర్ణయాలు, సమీకృత డిజిటల్‌ వేదికలు, కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాల నిర్వహణలో సింగపూర్‌ అనుభవాన్ని వినియోగించుకోవాలని సూచించారు. గతంలో తుపానుల కారణంగా కొన్ని కార్యక్రమాలు ఆలస్యమైనా, ఇకపై వేగవంతం చేస్తామని తెలిపారు. కమిటీ నిర్ణయాల అమలును ప్రతి ఆరు నెలలకోసారి సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేక నోడల్‌ అధికారిని నియమించినట్లు అధికారులు వివరించారు. సింగపూర్‌ ప్రతినిధి బృందం ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించింది. సమావేశంలో ఇరు ప్రభుత్వాల ఉన్నతాధికారులు, సింగపూర్‌ మంత్రి గన్‌ సియో హువాంగ్‌ నేతృత్వంలోని ప్రతినిధులు పాల్గొన్నారు.

 

#SingaporeTraining #APTeachers #AndhraPradeshEducation #NaraLokesh #TeacherTraining #EducationReforms #SingaporeEducationModel #SkillDevelopment #DigitalGovernance #APSingaporePartnership