ఆంధ్రప్రదేశ్‌లో స్టార్టప్‌లు, పరిశోధనలు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (డబ్ల్యూఐపీవో) సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. విశాఖలో జరగనున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో డబ్ల్యూఐపీవో డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్తో ఆయన సమావేశమయ్యారు. స్టార్టప్ వ్యవస్థాపకులు, విద్యార్థులు, పరిశోధకులకు పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌లు, డిజైన్లు, మేధో సంపత్తి హక్కులపై శిక్షణ ఇచ్చేందుకు ఏపీ–డబ్ల్యూఐపీవో అకాడమీ ఏర్పాటు చేసే అంశాన్ని చర్చించారు. చేనేత, హస్తకళలు, స్థానిక ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు తీసుకురావడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో బ్రాండింగ్, ప్రచారానికి సహకరించాలని కోరారు. రాష్ట్రంలో స్టార్టప్‌ల అభివృద్ధి కోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువతను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమాల్లో డబ్ల్యూఐపీవో భాగస్వామి కావాలని ఆహ్వానించారు. క్వాంటం టెక్నాలజీ, ఏఐ రంగాల్లో ఏపీ చేస్తున్న కృషిని డారెన్ టాంగ్ అభినందించారు.
10 లక్షల మంది మహిళా వ్యాపారవేత్తలు
రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతో పాటు క్వాంటం టెక్నాలజీ, కృత్రిమ మేధ, అంతరిక్ష సాంకేతికత, గ్రీన్ ఎనర్జీ, సహజ వ్యవసాయ రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు కల్పిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఆధునిక సాంకేతికతలో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి భవిష్యత్తు అవసరాలకు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. 10 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. మహిళలు తయారుచేసే ఉత్పత్తులకు ‘స్వయం ఏపీ’ బ్రాండ్ ద్వారా గుర్తింపు కల్పిస్తున్నట్లు వివరించారు. వారి ఉత్పత్తులకు మేధో సంపత్తి హక్కుల రక్షణ, అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలు కల్పించేందుకు డబ్ల్యూఐపీవో సహకరించాలని కోరారు. ప్రభుత్వ పాలనలోనూ సాంకేతికతను వినియోగిస్తూ సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని తెలిపారు. స్టార్టప్ వ్యవస్థను బలోపేతం చేయడం, మహిళా సాధికారతకు అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని వినియోగించుకోవడం ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చాయి.
#AndhraPradesh #WIPO #RatanTataInnovationHub #Startups #ChandrababuNaidu #DarenTang #IntellectualPropertyRights #WomenEntrepreneurs #QuantumTechnology #ArtificialIntelligence #SwayamAP #CIIPartnershipSummit2026











