Home AP ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై యూఏఈ ఆసక్తి!

ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై యూఏఈ ఆసక్తి!

మారిటైమ్‌, ఏరోస్పేస్‌ రంగాల్లోనూ భాగస్వామ్యం.

ఆంధ్రప్రదేశ్‌లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, ఎగుమతుల రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని దుబాయ్‌, యూఏఈకి చెందిన ప్రముఖ కంపెనీలను ఆహ్వానించారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ సదస్సుకు హాజరైన యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్‌ తౌక్‌ అల్‌ మర్రీతో సీఎం సమావేశమయ్యారు. రూ.లక్ష కోట్లతో రాయలసీమను గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఇప్పటికే ఈ ప్రాంతం నుంచి పండ్లు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. యూఏఈ ఏర్పాటు చేయనున్న ఫుడ్‌ క్లస్టర్‌లో తమ దేశానికి చెందిన అగ్రిఫుడ్‌ సంస్థ సిలాల్‌ పెట్టుబడులు పెట్టాలని కోరారు. చిత్తూరు జిల్లాలో దుబాయ్‌కి చెందిన ఫ్లోర్‌మాస్టర్‌ పరిశ్రమ ఏర్పాటుపైనా చర్చించారు. ఫుడ్‌ క్లస్టర్‌ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని యూఏఈ మంత్రిని కోరారు. మారిటైమ్‌, ఏరోస్పేస్‌, రక్షణ రంగాల్లోనూ పెట్టుబడులకు ఏపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

ఏపీ పెట్టుబడులకు కీలక కేంద్రం

భోగాపురం విమానాశ్రయం అద్భుతంగా ఉందని యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్‌ తౌక్‌ అల్‌ మర్రీ ప్రశంసించారు. అత్యాధునిక విమానాశ్రయాన్ని నిర్మించినందుకు చంద్రబాబును అభినందించారు. భారత తూర్పు తీరంలో పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈ ఆసక్తిగా ఉందని, ఆంధ్రప్రదేశ్‌ తమ పెట్టుబడులకు కీలక కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు. గూగుల్‌ వంటి సంస్థల డేటా సెంటర్లు, ప్రముఖ కంపెనీలు ఏపీకి రావడం సానుకూల పరిణామమని అన్నారు. రాష్ట్రం నుంచి రొయ్యలతో పాటు ఇతర ఆక్వా ఉత్పత్తులను దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు యూఏఈ ప్రతినిధులు తెలిపారు. ఏపీలో ఏర్పాటు చేయనున్న ఫుడ్‌ క్లస్టర్‌లో పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈకి చెందిన మరో 12 కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని వెల్లడించారు. ఈ సమావేశంలో ఇరు దేశాల అధికారులు, కంపెనీల ప్రతినిధులు, ఏపీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

#UAEInvestments #AndhraPradesh #APFoodProcessing #ChandrababuNaidu #UAE #DubaiInvestments #FoodCluster #RayalaseemaHorticulture #MaritimeSector #Aerospace #DefenceInvestments #BhogapuramAirport #SeafoodExports