Home AP భోగాపురం సిద్ధం మోదీ రాకకు గ్రాండ్ ప్లాన్

భోగాపురం సిద్ధం మోదీ రాకకు గ్రాండ్ ప్లాన్


ఉత్తరాంధ్రకు కలల రెక్కలు
ప్రారంభోత్సవంపై సీఎం సమీక్ష

భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. భద్రత, ట్రాఫిక్, అతిథుల స్వాగతం, సభా ఏర్పాట్లు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజిన్

భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని చంద్రబాబు తెలిపారు. 2,703 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,727 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఆధునిక సౌకర్యాలతో సిద్ధమైందన్నారు. 3,800 మీటర్ల రన్‌వేతో తొలి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యం కలిగి ఉందని చెప్పారు. 500 ఎకరాల్లో ఏవియేషన్ హబ్, 136 ఎకరాల్లో ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటుతో ఉపాధి, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు పెద్ద ఊతం లభిస్తుందని వివరించారు.

ధింసా నృత్యంతో ప్రధానికి స్వాగతం

ప్రధాని మోదీకి ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలా ఘన స్వాగతం పలకాలని సీఎం సూచించారు. గిరిజనుల సంప్రదాయ ధింసా నృత్యం, కూచిపూడి ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అత్యధిక మంది పాల్గొనే ధింసా నృత్యంతో గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించేలా ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. అరకు కాఫీ, ఉత్తరాంధ్ర పర్యాటక విశేషాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని సూచించారు.

రూ.18 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం

ప్రధాని మోదీ ఉదయం 10:45 గంటలకు ప్రత్యేక విమానంలో భోగాపురం చేరుకోనున్నారు. విమానాశ్రయ టెర్మినల్‌ను ప్రారంభించిన తర్వాత రూ.18 వేల కోట్ల విలువైన పెట్రోలియం, రహదారులు, ఇతర శాఖలకు చెందిన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

 

#BhogapuramAirport #Bhogapuram #PMModi #ChandrababuNaidu #AndhraPradesh #NorthAndhra #AlluriSitaramaRajuAirport #GreenfieldAirport #Vizianagaram #AirportInauguration #Development #Infrastructure #Aviation #IndiaNews #BreakingNews