చరిత్రకు అక్షర నీరాజనం.. సారస్వత నికేతనంలో పరకాల ప్రభాకర్!

Parakala Prabhakar Visits Historic Saraswata Niketanam

అరుదైన గ్రంథాలు, తాళపత్రాల సందర్శన
గాంధీ చేతికర్ర.. రాజేంద్రప్రసాద్ స్మారక ధ్వజస్తంభం పరిశీలన

చిరకాల కోరిక నెరవేరింది

బాపట్ల జిల్లా వేటపాలెంలోని వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన సారస్వత నికేతనాన్ని ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ సోమవారం సందర్శించారు. గ్రంథాలయ సీనియర్ లైబ్రేరియన్ పి. శ్రీవల్లి, సహాయకుడు బండారు గోపికృష్ణ, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. గ్రంథాలయ స్థాపన, అభివృద్ధి, నిర్వహణ విశేషాలను వివరించారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో మహాత్మా గాంధీ సందర్శించిన సందర్భంగా వదిలివెళ్లిన చేతికర్రను పరకాల ప్రభాకర్ ఆసక్తిగా పరిశీలించారు. భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ ఏర్పాటు చేసిన స్మారక ధ్వజస్తంభం ప్రాధాన్యతను తెలుసుకున్నారు. స్వాతంత్ర్యోద్యమ కాలం నాటి పత్రికలు, అరుదైన తాళపత్ర గ్రంథాలు, ప్రాచీన సాహిత్య రచనలను పరిశీలించారు.

తీర్థయాత్రకు వచ్చిన అనుభూతి

గ్రంథాలయంలో భద్రపరిచిన అపురూప చారిత్రక, సాహిత్య సంపదను చూసి ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తరతరాలకు విజ్ఞానాన్ని అందిస్తున్న సారస్వత నికేతనం వంటి గ్రంథాలయాలు మన సాంస్కృతిక వారసత్వానికి విలువైన చిరునామాలని కొనియాడారు. సందర్శకుల రిజిస్టర్‌లో తన అభిప్రాయాన్ని నమోదు చేస్తూ.. సారస్వత నికేతనాన్ని చూడాలన్న చిరకాల కోరిక నెరవేరిందని, ఇక్కడికి రావడం తీర్థయాత్రకు వచ్చిన అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు. తెలుగు నేలపై మరెక్కడా లభించని ఎన్నో పురాతన గ్రంథాలు, తాళపత్రాలు, పత్రికలను చూసే అవకాశం కలిగిందన్నారు. ఈ సంపదను స్థాపించినవారు, నిర్వహణకు సహకరించినవారు, ప్రస్తుతం సేవలందిస్తున్న సిబ్బంది అభినందనీయులని ప్రశంసించారు. మరోసారి సందర్శిస్తానని ఆకాంక్షించారు. ఈ పర్యటనలో రాష్ట్ర చేనేత జన సమాఖ్య వ్యవస్థాపకులు డాక్టర్ మాచర్ల మోహన్ రావు, సీనియర్ జర్నలిస్టు ఎన్. నాగార్జున రెడ్డి, చేనేత నాయకులు దేవన వీర నాగేశ్వరరావు, గుంటూరు మల్లికార్జునరావు, ఓరుగంటి రెడ్డి రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు మేడిబోయిన వెంకటరెడ్డి, బీసీ నాయకులు కొల్లిపర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.