ఆహార ప్యాకెట్లపై లేబుల్స్ తప్పనిసరి.
కేంద్రానికి సుప్రీంకోర్టు గట్టి హెచ్చరిక.
ఒకప్పుడు పిల్లల చేతిలో బొమ్మలు ఉండేవి.. ఇప్పుడు ప్యాకెట్ ఫుడ్ ఉంది. రంగురంగుల ప్యాకెట్లు.. ఆకట్టుకునే యాడ్లు.. పిల్లల్ని ఊరించే రుచులు. కానీ ఆ ప్యాకెట్ వెనుక దాగి ఉన్న ఉప్పు ఎంత? చక్కెర ఎంత? సంతృప్త కొవ్వు ఎంత? అన్నది మాత్రం తల్లిదండ్రులకు అంత ఈజీగా కనిపించదు. పిల్లాడు అడిగితే కొనివ్వాలా? వద్దా? అని తల్లిదండ్రులే రోజూ తర్జనభర్జన పడాల్సిన పరిస్థితి. కంపెనీలకు మాత్రం అమ్మకాలు ముఖ్యం.. తల్లిదండ్రులకు పిల్లల ఆరోగ్యం ముఖ్యం. ఈ రెండింటి మధ్యే అసలు పోరాటం. ఇప్పుడు ఈ పోరాటంలో సుప్రీంకోర్టు ఎంట్రీ ఇచ్చింది. పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దని కేంద్రానికి గట్టి హెచ్చరిక చేసింది. ప్యాకెట్ ముందు భాగంలోనే ప్రమాదకర స్థాయిలో ఉన్న ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వులపై స్పష్టమైన హెచ్చరికలు ఉండాలని సూచించింది. కంపెనీల అమ్మకాలు తగ్గుతాయా? మార్కెట్ దెబ్బతింటుందా? అన్నది తర్వాతి విషయం.. ముందు ప్రజలకు నిజం తెలియాలి. తినేది ఏంటో తెలుసుకునే హక్కు ప్రతి కుటుంబానిదే. పిల్లల అమాయకత్వాన్ని మార్కెట్ లాభాల కోసం వాడుకుంటే.. అది వ్యాపారం కాదు, బాధ్యతను మరిచిన వ్యవస్థ. ఈ తీర్పు ఒక్క ప్యాకెట్‌పై లేబుల్ కోసం కాదు.. ప్రతి ఇంట్లో పిల్లల ఆరోగ్యానికి కనిపించని పోరాటానికి ఓ హెచ్చరిక.
అధిక ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వులు ఉన్న ఆహార పదార్థాలపై స్పష్టమైన హెచ్చరిక లేబుల్స్ ఏర్పాటు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. ప్రజల ఆరోగ్యానికి, ముఖ్యంగా పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో నిర్లక్ష్యం తగదని స్పష్టం చేసింది. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తామే తగిన ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించింది. జస్టిస్ జేబీ పర్దీవాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం ఈ అంశంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించింది. కేంద్ర ప్రభుత్వం, భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ వ్యవహరిస్తున్న తీరుపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజారోగ్య అంశాల్లో ఆహార పరిశ్రమ ఒత్తిళ్లకు ప్రాధాన్యం ఇవ్వకూడదని స్పష్టం చేసింది.
ప్యాకెట్ ముందే హెచ్చరిక
అధిక చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వుల వల్ల కలిగే ప్రమాదాలపై వినియోగదారులకు సులభంగా అర్థమయ్యే సమాచారం ప్యాకెట్ ముందు భాగంలోనే ఉండాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ప్రస్తుతం పోషక విలువలను పట్టిక రూపంలో చూపించే విధానం మాత్రమే సరిపోదని కోర్టు ముందు వాదనలు వినిపించాయి. తాను కొనుగోలు చేసే ఆహారంలో ఎంత చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వు ఉందో తెలుసుకునే హక్కు ప్రతి వినియోగదారుడికీ ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హెచ్చరిక లేబుల్ ఉన్నా ఉత్పత్తిని కొనాలా, వద్దా అనేది చివరికి వినియోగదారుడి నిర్ణయమేనని పేర్కొంది. ఉత్పత్తి అమ్మకాలపై ప్రభావం పడుతుందని తయారీదారులు అభ్యంతరం చెప్పే అవకాశం ఉందని కోర్టు గుర్తుచేసింది.
చర్యలు తీసుకోడానికి రెండు వారాలు
గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలపై కేంద్రం ఇప్పటివరకు తీసుకున్న చర్యలేంటని ధర్మాసనం ప్రశ్నించింది. హెచ్చరిక లేబుల్స్ విషయంలో ఆలస్యం ఎందుకు జరుగుతోందని నిలదీసింది. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాల్లో మరింత స్పష్టత, వేగం అవసరమని కోర్టు అభిప్రాయపడింది. హెచ్చరిక లేబుల్స్‌కు సంబంధించిన ప్రతిపాదనపై చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు రెండు వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణలో పరిస్థితిని పరిశీలించిన తర్వాత అవసరమైతే తుది ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో పిల్లల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అధిక ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వులు ఉన్న ఆహార పదార్థాలపై ఇక స్పష్టమైన హెచ్చరికలు తప్పవా అన్న చర్చ మొదలైంది.
#SupremeCourt #FoodWarningLabels #PackagedFood #FoodLabels #HighSugar #HighSalt #SaturatedFat #ChildHealth #PublicHealth #FSSAI #FoodSafety #ConsumerRights #FoodRegulations #IndiaNews #SupremeCourtIndia











