కూకట్‌పల్లి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.
తెలంగాణ రాజకీయాల్లో అభివృద్ధి, సంక్షేమం మాటల మధ్య మరోసారి రాజకీయ విమర్శలు వేడెక్కాయి. కూకట్‌పల్లిలో ‘ఇందిరమ్మ ఇండ్లు టవర్స్’ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి గత ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరువు రావాలని కొందరు దుర్మార్గులు క్షుద్ర పూజలు చేశారని ఆరోపించారు. అయితే దేవుడు తమ వైపు ఉన్నందుకే వర్షాలు కురిశాయని అన్నారు. కుటిల బుద్ధితో క్షుద్ర పూజలు చేసే వారికి అవే తిరిగి అష్టదిగ్బంధనం చేస్తాయని వ్యాఖ్యానించారు.
పదేళ్ల పాలనకు రెండేళ్లతో పోలిక!
పదేళ్లు అధికారంలో ఉన్న వారి పాలనను, రెండేళ్ల తమ ప్రభుత్వ పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని రేవంత్‌రెడ్డి కోరారు. తెలంగాణను విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు చెల్లిస్తూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. కూకట్‌పల్లి అభివృద్ధికి అన్ని రకాల అధికారాలు ఇప్పుడు తమ ప్రభుత్వానికి ఉన్నాయని స్పష్టం చేశారు.
మహిళలకు ఆర్థిక బలం
తెలంగాణలో 3 కోట్ల 28 లక్షల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని సీఎం తెలిపారు. పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని చెప్పారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం ఇందిరమ్మ చీరలు, ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని వివరించారు. స్వయం సహాయక సంఘాలకు రూ.65 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించామని పేర్కొన్నారు. ఆడబిడ్డలను బస్సులకు యజమానులను చేశామని రేవంత్‌రెడ్డి అన్నారు. పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను విక్రయించుకునేందుకు శిల్పారామంలో స్టాళ్లు ఏర్పాటు చేశామని వివరించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు.
అబద్ధపు ప్రచారాన్ని నమ్మొద్దు
పట్టణ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ‘ఇందిరమ్మ ఇండ్లు టవర్స్’కు శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు. తొలి విడతలో లక్ష ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని గతంలో చెప్పిన వారు మీలో ఒక్కరికైనా ఇల్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. సొంత భూములు కోల్పోకుండా చూసే బాధ్యత తమదేనని భరోసా ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సీఎం ప్రజలకు సూచించారు. కూకట్‌పల్లి నియోజకవర్గాన్ని ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేయాలని మంత్రి శ్రీధర్‌బాబును ఆదేశించారు. తనకు వయసు, ఓపిక ఉన్నాయని, ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పం ఉందని చెప్పారు. ప్రజలు అండగా నిలిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
#RevanthReddy #Kukatpally #TelanganaPolitics #IndirammaIndlu #IndirammaHouses #TelanganaCM #RevanthReddySpeech #TelanganaDevelopment #BRS #Congress #WomenEmpowerment #TelanganaWelfare #KukatpallyDevelopment #TelanganaNews #Hyderabad











