Home Telangana ఆ పేరు మాకే.. ఫికర్ చేయొద్దు మొదట ఇచ్చాక ఈ పంచాయితీ ఏంటి? 105...

ఆ పేరు మాకే.. ఫికర్ చేయొద్దు మొదట ఇచ్చాక ఈ పంచాయితీ ఏంటి? 105 నియోజకవర్గాల్లో పార్టీ విస్తరణ ఈసీకి లేఖ రాసిన తెలంగాణ రక్షణ సేన గుర్తింపు కోసం ఎన్నికల సంఘానికి లేఖ

14



తెలంగాణ రక్షణ సేన, టీఆర్ఎస్ పార్టీకి వెంటనే అధికారిక గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఢిల్లీ హైకోర్టు తాజా ఆదేశాల మేరకు ఎన్నికల సంఘానికి తన లిఖితపూర్వక సమాధానాన్ని సమర్పించినట్లు వెల్లడించారు. అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు ఇతర కమిషనర్లకు ప్రత్యేక లేఖ పంపారు. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిష్పాక్షికంగా పూర్తి చేసి గుర్తింపు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

105 నియోజకవర్గాల్లో పార్టీ విస్తరణ

ఈ ఏడాది ఏప్రిల్ 28న ఎన్నికల సంఘం తెలంగాణ రక్షణ సేన పేరును కేటాయించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు కవిత వివరించారు. ఆ నిర్ణయాన్ని విశ్వసించి తెలంగాణలోని 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించి సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి చేశామని తెలిపారు. పార్టీ కార్యకలాపాలు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లాయని, ఇప్పుడు పేరు మార్చాలని సూచిస్తే తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

వెయ్యి అభ్యంతరాలపై ప్రశ్నలు

పార్టీ రిజిస్ట్రేషన్‌పై సుమారు వెయ్యి అభ్యంతరాలు వచ్చాయని ఎన్నికల సంఘం జూన్ 23న లేఖ పంపిందని కవిత తెలిపారు. అయితే ఆ అభ్యంతరాల ప్రతులను తమకు అందించలేదని పేర్కొన్నారు. ఎవరు అభ్యంతరాలు తెలిపారు? వాటి స్వరూపం ఏమిటి? అనే వివరాలు తెలియకుండా సమాధానం ఎలా ఇవ్వగలమని ప్రశ్నించారు. మూడున్నర కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో వెయ్యి అభ్యంతరాల ఆధారంగా నిర్ణయం తీసుకోవడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. కొందరు ఉద్దేశపూర్వకంగా సమూహాలుగా ఏర్పడి ఈ అభ్యంతరాలను పంపించారా అనే కోణంలో కూడా విచారణ జరపాలని కోరారు.

హైకోర్టు ఆదేశాల అమలు కోరిన కవిత

ఢిల్లీ హైకోర్టు సూచించిన విధంగా వ్యక్తిగత విచారణకు ముందే అన్ని అభ్యంతరాల కాపీలు, తమకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను అందించాలని ఎన్నికల సంఘాన్ని కవిత కోరారు. వాటిని అధ్యయనం చేయడానికి తగిన సమయం కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం పూర్తి సమాచారం అందించిన తర్వాతే విచారణ నిర్వహించాలని పేర్కొన్నారు.

పేరు విషయంలో ఈసీకి వివరణ

తెలంగాణ రక్షణ సేన అనే పేరును పూర్తిగా స్వతంత్రంగా ఎంపిక చేశామని కవిత స్పష్టం చేశారు. దేశంలో ఇదే పేరుతో మరో రాజకీయ పార్టీ నమోదు కాలేదని తెలిపారు. రాజకీయ పార్టీల పేర్లను విడివిడిగా కాకుండా మొత్తం పేరుగా పరిశీలించాలని సూచించారు. ఎన్నికల సంఘం ప్రస్తావించిన ఇతర పార్టీల పేర్లు ఉచ్చారణ, నిర్మాణం, నాయకత్వం పరంగా పూర్తిగా భిన్నమైనవని వివరించారు. దేశవ్యాప్తంగా ఒకే తరహా పదాలతో వందలాది పార్టీలు నమోదు అయ్యాయని గుర్తుచేస్తూ వాటి వివరాలను కూడా ఎన్నికల సంఘానికి సమర్పించినట్లు వెల్లడించారు.

న్యాయబద్ధ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి

ఊహాగానాలు, సంక్షిప్త రూపాల ఆధారంగా వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవద్దని కవిత కోరారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ విస్తరణ చేపట్టిన నేపథ్యంలో ఇప్పుడు పేరు మార్చాలని చెప్పడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 29ఏ ప్రకారం దాఖలు చేసిన దరఖాస్తును చట్టబద్ధంగా, నిష్పాక్షికంగా పరిశీలించి తెలంగాణ రక్షణ సేన, టీఆర్ఎస్ పార్టీకి గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.