పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ప్రకటన.
శంషాబాద్‌లో ఆదివారం జరిగిన టీపీసీసీ ఓబీసీ బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. భవిష్యత్తులో తెలంగాణకు బీసీ నేత ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. బీసీ సీఎం అభ్యర్థికి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క వర్గానికో, వ్యక్తికో, ప్రాంతానికో పరిమితం కాదని స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన ఎవరి వాటా వారికి దక్కాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అన్ని కులాల మద్దతుతో బీసీలు తమ హక్కు సాధించుకుంటారని, అవసరమైతే హక్కుల కోసం పోరాడతామని అన్నారు.
బీసీలకు ప్రాధాన్యం
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నుంచి ‘ఎవరి జనాభా ఎంత.. వారి వాటా అంత’ అనే భావనను ముందుకు తీసుకెళ్తున్నారని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 55 శాతానికి పైగా సర్పంచ్ పదవులు బీసీలకు దక్కేలా చేశామని, మున్సిపల్ ఎన్నికల్లో 58 శాతం సీట్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లలో బీసీల ప్రాతినిధ్యం మరింత పెంచుతామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రుల సహకారంతో నిర్వహించిన కుల సర్వే ఆధారంగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు.
దేశవ్యాప్త కుల సర్వే
రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కుల సర్వే నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. బీసీలంతా ఐక్యంగా నిలిచి తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కుల గణన కేవలం సంఖ్యల కోసం కాదని, హక్కులు, అవకాశాలు, అభివృద్ధిలో సరైన ప్రాతినిధ్యం కోసం అది పునాది అని అన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు హక్కులు దక్కే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
#TelanganaBCCM #MaheshKumarGoud #TelanganaCongress #BCCM #BCs #OBC #CasteCensus #OBCCasteCensus #BCRights #RahulGandhi #RevanthReddy #MallikarjunKharge #PonnamPrabhakar #Shamshabad #TelanganaPolitics











