Home Telangana రైతు కరువు కాదు.. సర్కార్ వైఫల్యం

రైతు కరువు కాదు.. సర్కార్ వైఫల్యం

నీళ్లు ఉన్నా కరెంట్‌ ఎందుకు లేదు?
మోటార్లు బంద్ పెట్టారన్న హరీశ్ రావు.

తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీశ్‌రావు తీవ్రంగా విమర్శించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని.. రేవంత్‌రెడ్డి పరిపాలనా వైఫల్యమేనని ఆరోపించారు. రైతులకు కనీసం 7 నుంచి 8 గంటల కరెంట్‌ కూడా అందడం లేదని అన్నారు. ఒకవైపు నీళ్లు ఉన్నా మోటార్లు నడపడం లేదని, మరోవైపు రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెం పవర్‌ ప్లాంట్‌ను ఎందుకు నిలిపివేశారని సీఎం రేవంత్‌రెడ్డిని నిలదీశారు. యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని కూడా పూర్తి సామర్థ్యంతో నడపడం లేదని విమర్శించారు. ప్రతిపక్షాలను అడ్డుకునేందుకు ఉన్న శక్తి రైతులకు విద్యుత్‌, సాగునీరు అందించడంలో ఎందుకు కనిపించడం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు.

మోటార్లు నడపకపోవడంపై నిలదీత

పాలమూరు ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై హరీశ్‌రావు ప్రత్యేకంగా ప్రశ్నలు సంధించారు. భీమా ప్రాజెక్టులో మూడు మోటార్లు ఉంటే ఒక్క మోటార్‌ మాత్రమే నడుపుతున్నారని ఆరోపించారు. నికర జలాల కేటాయింపులు ఉన్న భీమా ప్రాజెక్టు మోటార్లను పూర్తిస్థాయిలో ఎందుకు నడపడం లేదని ప్రశ్నించారు. నెట్టంపాడు ప్రాజెక్టులో నాలుగు మోటార్లు ఉంటే ఒక్కటే పనిచేస్తోందని, కోయిల్‌సాగర్‌లో మూడు మోటార్లకు ఒక్క మోటార్‌ మాత్రమే నడుపుతున్నారని చెప్పారు. రెండు మోటార్లు నడిపినా కోయిల్‌సాగర్‌ నిండేందుకు మూడు నెలలు పడుతుందని, ఒక్క మోటార్‌తో ఆరు నెలలు పట్టే పరిస్థితి ఉందని వివరించారు. అప్పటివరకు జూరాల ప్రాజెక్టులో నీరు ఉంటుందా అని ప్రశ్నించారు. నీళ్లు ఉన్నా మోటార్లు నడపలేని ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నానంటూ రేవంత్‌రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కృష్ణా జలాల వినియోగంపైనా విమర్శలు

కృష్ణా జలాల వినియోగంలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వం వెనుకబడిందని హరీశ్‌రావు ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న 2014-15 నుంచి 2023-24 వరకు ప్రతి ఏడాది కృష్ణా నదిలో తెలంగాణకు వచ్చిన నీటిలో 30 నుంచి 45 శాతం వరకు ఎత్తిపోశామని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 2024-25లో 28.49 శాతం నీటిని మాత్రమే వినియోగించిందని, 2025-26లో ఈ వాటా 25 శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కృష్ణా జలాల్లో ఇంత తక్కువ సాగునీటిని వినియోగించిన కాలం ఇదేనని విమర్శించారు. రైతులకు నీళ్లు అందించేందుకు అందుబాటులో ఉన్న ప్రాజెక్టులు, మోటార్లను పూర్తిస్థాయిలో వినియోగించాలని డిమాండ్‌ చేశారు. సాగునీటి సమస్యను కేవలం వర్షాభావ పరిస్థితులకు ఆపాదించకుండా, ప్రాజెక్టుల నిర్వహణ, విద్యుత్‌ సరఫరా, నీటి ఎత్తిపోతలపై ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు కోరారు.

#HarishRao #RevanthReddy #TelanganaFarmers #TelanganaIrrigation #IrrigationCrisis #KrishnaWater #Palamuru #BhimaProject #Nettampadu #Koilsagar #TelanganaPower #BRS #Congress