Home Telangana 22-ఎ భూ సమస్యలకు ఇక శాశ్వత పరిష్కారం!

22-ఎ భూ సమస్యలకు ఇక శాశ్వత పరిష్కారం!

పెండింగ్ దరఖాస్తులన్నీ వెంటనే పరిష్కరించాలి.
కలెక్టర్లకు మంత్రి పొంగులేటి కఠిన ఆదేశాలు.

ఏళ్ల తరబడి పరిష్కారం కాకుండా ఉన్న 22-ఎ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ సమస్యలపై వచ్చిన దరఖాస్తులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని, ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్‌లో ఉండకూడదని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ప్రభుత్వం ఇప్పటికే పలు ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. జీవో 118, జీవో 76కు సంబంధించిన మెమోలు, అనుమతులు పొందిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు, యూఎల్‌సీ దరఖాస్తులు, నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూములు, జీవో 59 అమలు వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినట్లు వివరించారు.

ప్రతి వారం కలెక్టర్ల స్థాయిలో సమీక్ష

ప్రభుత్వ ఉత్తర్వులు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలైనప్పుడే ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రతి వారం కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్, సంబంధిత అధికారులు సమావేశమై 22-ఎ దరఖాస్తుల పరిష్కారంపై సమీక్షించాలని సూచించారు. జిల్లా స్థాయిలో పరిష్కరించలేని సమస్యలను రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్‌కుమార్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీకి పంపాలని ఆదేశించారు. అర్హులైన భూ యజమానులకు న్యాయం జరిగేలా కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను పూర్తిగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా యూఎల్‌సీ అంశాల్లో కోర్టుల తుది తీర్పులు, ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో ప్రత్యేక అనుమతి పిటిషన్లు (ఎస్‌ఎల్‌పీలు) దాఖలు చేసే అవకాశాలపై సమగ్ర పరిశీలన జరగాలని సూచించారు.

వారం రోజుల్లో నివేదిక.. సీఎం సమీక్ష

యూఎల్‌సీకి సంబంధించిన అన్ని అంశాలపై వారం రోజుల్లోగా ఉన్నతస్థాయి కమిటీ సమగ్ర నివేదిక సమర్పించాలని మంత్రి ఆదేశించారు. ఆ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, భూముల క్రమబద్ధీకరణపై తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. 22-ఎ జాబితాలోని ప్రతి భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్ వివరాలు, ఇతర ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను నిర్ధారించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిజమైన యజమానులు తమ భూములపై హక్కులు పొందేందుకు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని అన్నారు. అర్హులకు న్యాయం చేసే విషయంలో నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరిస్తూనే, ప్రభుత్వ భూములు, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన భూముల విషయంలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని మంత్రి ఆదేశించారు.

 

#22ALandIssues #TelanganaLandDisputes #PonguletiSrinivasReddy #TelanganaRevenueDepartment #LandRegularisation #GO118 #GO76 #GO59 #ULC #RevanthReddy