అక్కడ మాత్రమే ఆంక్షలన్న కమిషనర్ రంగనాథ్ .
హైదరాబాద్లో గణేశ్ నిమజ్జనాలపై జరుగుతున్న ప్రచారానికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెరదించారు. చెరువుల్లో గణేశ్ విగ్రహాల నిమజ్జనాన్ని హైడ్రా అడ్డుకుంటోందన్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నోటిఫై చేసిన నాలుగైదు సున్నితమైన చెరువుల్లో మాత్రమే నిమజ్జనాలపై ఆంక్షలు ఉన్నాయని తెలిపారు. దేశంలో తొలి బయోడైవర్సిటీ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన అమీన్పూర్ చెరువు, నేచురల్ వెట్ల్యాండ్గా రక్షణలో ఉన్న కాప్రా చెరువు ఈ జాబితాలో ఉన్నాయని వివరించారు. కాప్రా చెరువులో ప్రస్తుతం నీరు కూడా లేదని, అక్కడ ఎలాంటి సమస్యలు సృష్టించవద్దని సూచించారు.
హైడ్రా పునరుద్ధరిస్తున్న చెరువుల్లోనూ ఓకే
హైడ్రా పునరుద్ధరణ, సుందరీకరణ పనులు చేపడుతున్న చెరువుల వద్ద గణేశ్ నిమజ్జనాలపై ఎలాంటి నిషేధం లేదని రంగనాథ్ స్పష్టం చేశారు. నగరంలోని మిగతా చెరువులు, జలాశయాల్లో నిమజ్జనాలను యథావిధిగా నిర్వహించుకోవచ్చన్నారు. ప్రధాన జలవనరులపై పర్యావరణ ప్రభావాన్ని తగ్గించేందుకు పలు ప్రాంతాల్లో ‘బేబీ పాండ్స్’ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పీవోపీ విగ్రహాల నిమజ్జనం కోసం ప్రతి చెరువు వద్ద ప్రత్యేక స్థలం కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో నిమజ్జనాల విషయంలో భక్తులు, ఉత్సవ కమిటీలకు ఎలాంటి అనవసర ఆందోళన అవసరం లేదని హైడ్రా స్పష్టం చేసింది.
మట్టి విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ
వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రజలు సహకరించాలని రంగనాథ్ కోరారు. “మట్టి విగ్రహాలను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం” అని పిలుపునిచ్చారు. నిమజ్జనాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. ఆంక్షలు ఉన్న చెరువులు మినహా మిగతా జలాశయాల్లో నిమజ్జనాలకు అనుమతి ఉందన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. పండుగ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా, పర్యావరణానికి నష్టం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
#HyderabadGaneshImmersion #HYDRA #AVRanganath #GaneshChaturthi #GaneshImmersion #HyderabadLakes #AmeenpurLake #KapraLake #GaneshFestival #PoPIdols #EnvironmentalProtection #Hyderabad











