Home Telangana రాజీనామా చేయాల్సింది ఎవరు?

రాజీనామా చేయాల్సింది ఎవరు?

నేను తీసుకుంటుంది రూపాయే జీతం.
హరీశ్‌రావుపై పొంగులేటి ఫైర్‌.

22ఏ భూముల అంశంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజల భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం పనిచేస్తుంటే, అసత్య ప్రచారాలతో తనను, ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఎందుకని ప్రశ్నించారు. “చీము, నెత్తురు, సిగ్గు, శరం ఉంటే రాజీనామా చేయాలని నన్ను అడుగుతున్నారు. మరి ప్రజాధనంతో ఇన్నేళ్లు అధికారాన్ని అనుభవించి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన వారు రాజీనామా చేయాల్సింది కాదా?” అని నిలదీశారు. తాను ప్రతి నెల కేవలం ఒక్క రూపాయి జీతం తీసుకుంటూ పేదల కోసం పనిచేస్తున్నానని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నానని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజల కోసం పనిచేస్తున్న తనను రాజీనామా చేయాలని అడగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రస్తావిస్తూ మాజీ మంత్రి హరీశ్‌రావును కూడా మంత్రి నిలదీశారు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు రూ.21 కోట్లు తీసుకున్న కేసీఆర్‌ అసెంబ్లీకి హాజరుకాకుండా ఫామ్‌హౌస్‌లో ఉంటే.. రాజీనామా చేయాల్సింది ఎవరో చెప్పాలని ప్రశ్నించారు.

‘పొంగులేటి.. పొంగు’ అంటూ ఎందుకంత భయం?

ప్రతిపక్షాల రాజకీయ వైఖరిపైనా పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. “అధికారంలో ఉంటే అవినీతి.. ప్రతిపక్షంలో ఉంటే బ్లాక్‌మెయిల్‌” అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు, తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రభుత్వం ఇది కాదని స్పష్టం చేశారు. తన పేరును పదేపదే ప్రస్తావిస్తూ “పొంగులేటి.. పొంగు” అంటూ చేస్తున్న వ్యాఖ్యలపైనా తీవ్రంగా స్పందించారు. “అలా ఎందుకు పదేపదే అంటున్నారు? ఎందుకు అంత భయం?” అని ప్రశ్నించారు. శుభకార్యంలో పాలు పొంగితే శుభమని, కానీ గోదావరి, కృష్ణా నదులు ఉగ్రరూపంతో పొంగితే ఆ ప్రవాహంలో తమ పార్టీ కూడా నామరూపాలు లేకుండా పోతుందని ఘాటు వ్యాఖ్య చేశారు. గతంలో ఖమ్మం సభలో కేసీఆర్‌ మరోసారి ముఖ్యమంత్రి కాలేరని తాను చెప్పిన మాటలను గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లోనూ అధికారంలోకి వచ్చేది ఇందిరమ్మ ప్రభుత్వమేనని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. 22ఏ భూముల అంశంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రతిపక్షాల విమర్శలకు తాను భయపడేది లేదని స్పష్టం చేశారు.

 

#PonguletiSrinivasReddy #Ponguleti #HarishRao #KCR #22ALands #22ALandIssue #TelanganaLandIssue #TelanganaPolitics #BRS #Congress #CongressTelangana #IndirammaGovernment #KCRFarmhouse #TelanganaGovernment #LandDispute #PonguletiComments #HarishRaoNews #TelanganaNews #PoliticalNews #TelanganaPolitics2026