భద్రత విషయంలో రాజీ వద్దు!
నిపుణుల పర్యవేక్షణలోనే పునరుద్ధరణ!
డిసెంబర్లో పనుల ప్రారంభానికి సీఎం ఆదేశాలు
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, జాతీయ డ్యామ్ సేఫ్టీ నిపుణుల సూచనలు, మార్గదర్శకాల ప్రకారమే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్మాణ లోపాలు పునరావృతం కాకుండా అత్యంత జాగ్రత్తగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మూడు బ్యారేజీలను సురక్షితంగా తిరిగి వినియోగంలోకి తీసుకురావడమే లక్ష్యంగా మంత్రులు, నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సుమారు రూ.4,193 కోట్ల అంచనాతో పునరుద్ధరణ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు. కేంద్ర నిపుణుల కమిటీ ప్రాథమిక ప్రణాళికలకు ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఈ నెలాఖరులోగా తుది అనుమతులు పొందాలని, ఈ ఏడాది చివరిలోగా పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. పనుల జాప్యానికి అవకాశం లేకుండా అన్ని ప్రక్రియలను సమాంతరంగా కొనసాగించాలని సూచించారు.
మేడిగడ్డ నీటిపై తప్పుడు ప్రచారానికి చెక్!
మేడిగడ్డ వద్ద నీళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటిని లిఫ్ట్ చేయడం లేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని సీఎం మంత్రులకు సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడి నీటిని సాంకేతికంగా ఎత్తిపోసే అవకాశం లేదని ఇంజనీర్లు వివరించారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించాలంటే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లు మూసివేయాల్సి ఉంటుందని తెలిపారు. అయితే నిర్మాణ లోపాల కారణంగా ఆ రెండు బ్యారేజీల గేట్లను తెరిచే ఉంచాలని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచించిన విషయాన్ని గుర్తుచేశారు. మరోవైపు దిగువ గోదావరి జలాలను వృథా చేయకుండా దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాల ద్వారా వినియోగిస్తున్నామని సీఎం తెలిపారు. గతంలో దేవాదుల ద్వారా ఏడాదికి సగటున 9.57 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేయగా, గత మూడేళ్లలో సగటున 18.13 టీఎంసీలకు పెరిగిందని చెప్పారు. ఇది 89 శాతం అధికం. అక్టోబర్ నాటికి దేవాదుల ద్వారా 16.71 టీఎంసీలు, సీతారామ ద్వారా 8.10 టీఎంసీలు కలిపి మొత్తం 24.81 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించినట్లు వెల్లడించారు. దీంతో ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఆయకట్టుకు సాగునీరు, తాగునీరు అందించామని వివరించారు.
రూ.4,193 కోట్లతో రెండు దశల్లో పనులు!
మూడు బ్యారేజీల పునరుద్ధరణను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నీటి వినియోగ సామర్థ్యాన్ని తిరిగి తీసుకురావడంతో పాటు రక్షణ పనులను రెండు దశల్లో చేపట్టాలని సూచించారు. నిర్మాణ లోపాలకు సంబంధించిన మరమ్మతుల ఖర్చును సంబంధిత నిర్మాణ సంస్థలే భరించేలా, అదనపు పనుల వ్యయాన్ని ప్రభుత్వం భరించేలా ప్రతిపాదనలు రూపొందించినట్లు అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం మేడిగడ్డ నిర్మాణంలో చేసిన తప్పుల వల్లే బ్యారేజీ కుంగిపోయిందని సీఎం పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే తక్కువ ఖర్చుతో ఎల్లంపల్లికి నీటిని తరలించే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డారు. కొత్త ప్రభుత్వం వచ్చాక వ్యవసాయ విస్తీర్ణం పెరిగిందని, వరి దిగుబడిలో దేశంలో రికార్డు సాధించామని గుర్తుచేశారు. బ్యారేజీల భద్రత, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, కేంద్ర సంస్థలు, నిర్మాణ సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, కల్నల్ పరీక్షిత్ మెహ్రా, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
#KaleshwaramProject #KaleshwaramBarrage #MedigaddaBarrage #AnnaramBarrage #SundillaBarrage #RevanthReddy #Telangana #BarrageRestoration #DamSafety #GodavariWater











