Home Telangana అసెంబ్లీ తర్వాత కేసీఆర్ రణం జలాల కోసం ప్రత్యక్ష పోరాటం

అసెంబ్లీ తర్వాత కేసీఆర్ రణం జలాల కోసం ప్రత్యక్ష పోరాటం

కార్యాచరణ వెల్లడించిన హరీశ్ .

అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల వ్యూహంపై ఎర్రవల్లిలో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ఎల్పీ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా కేసీఆర్ నాయకత్వంలో లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమం చేపడతామని ప్రకటించారు. కాళేశ్వరం వద్ద నీళ్లున్నా ఎత్తిపోతలు చేయడం లేదని, కేసీఆర్ హయాంలో 80 శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిన పనులు పూర్తి చేస్తే 60 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు.

30 లక్షల విద్యార్థుల కోసం పోరాటం

ప్రజా సమస్యలపై సమగ్ర చర్చకు కనీసం నెల రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేయనుందని హరీశ్ రావు తెలిపారు. 22ఏ కింద వ్యవసాయ భూములను నిషేధిత జాబితాలో చేర్చడం, విద్యుత్ కోతలు, రుణమాఫీ, పాలిటెక్నిక్ జీవో 97, సింగరేణి అంశాలు, పీఆర్సీ, డీఏలు, ఈహెచ్ఎస్ వంటి సమస్యలను సభలో లేవనెత్తుతామని చెప్పారు. ముఖ్యంగా 30 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై సభను స్తంభింపజేసినా పోరాడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రేవంత్ రెడ్డి కొత్త రాజకీయాలకు తెరతీశారని విమర్శించారు.

సభకు కేసీఆర్ దూరం

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వాడుతున్న భాషపై హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. అలాంటి భాషతో సభ గౌరవం దెబ్బతింటోందని, కేసీఆర్ వంటి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్ణయించారని చెప్పారు. కేసీఆర్ భద్రతపై ప్రశ్నిస్తున్న రేవంత్ రెడ్డి తన సోదరుడు తిరుపతి రెడ్డికి నలుగురు గన్‌మెన్లను ఏర్పాటు చేసి రూ.40 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్టీఆర్, జయలలిత, చంద్రబాబు వంటి నేతలు సభను బహిష్కరించి ప్రజల్లోకి వెళ్లి తిరిగి అధికారంలోకి వచ్చిన ఉదాహరణలను ప్రస్తావించారు. కేసీఆర్ కూడా అదే బాటలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలతోనే సమాధానం చెబుతారని హరీశ్ రావు అన్నారు.

 

#KCR #HarishRao #BRS #KCRWaterAgitation #WaterRights #TelanganaWater #Kaleshwaram #PalamuruRangaReddy #TelanganaIrrigation #BRSAgitation #KCRPoliticalBattle #HarishRaoNews #TelanganaAssembly #StudentFeeReimbursement #TelanganaStudents #FarmLoanWaiver #PowerCuts #PRC #DA #EHS #RevanthReddy #TelanganaPolitics