కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలన డిజాస్టర్, అట్టర్ ఫ్లాప్ అంటూ మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశానికి కేటీఆర్, హరీశ్‌రావు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో కేసీఆర్ చర్చించారు. పార్టీ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ పతనం ఖాయమని గ్రహించే అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. పాలన చేతకాకే సీఎం రేవంత్‌రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వారితో చర్చించేందుకు అసెంబ్లీకి రావాలా అంటూ ప్రశ్నించారు.
నీళ్ల కోసం ఉధృత పోరాటం
కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాన్ని అసెంబ్లీలో ప్రధానంగా లేవనెత్తాలని కేసీఆర్ బీఆర్ఎస్ సభ్యులను ఆదేశించారు. రైతులకు ఉద్దేశపూర్వకంగా సాగునీరు అందించడం లేదని, రాజకీయ కారణాలతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల పంపులు ఎందుకు ఆన్ చేయడం లేదని ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల వద్దకు బీఆర్ఎస్ నేతలు వెళ్లాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన కచ్చితంగా జరుగుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీ, మండలి సమావేశాల్లో ప్రభుత్వంపై మరింత గట్టిగా పోరాడాలని స్పష్టం చేశారు.
ప్రజా సమస్యలే బీఆర్ఎస్ అజెండా
అసెంబ్లీ సమావేశాలకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పనిసరిగా హాజరై ప్రతి చర్చలో చురుగ్గా పాల్గొనాలని కేసీఆర్ సూచించారు. సమావేశాలను ఎవరూ తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీ విధానాలను ఉభయసభల్లో ఎండగట్టాలని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆదేశించారు. స్పీకర్ పక్షపాత ధోరణి, అప్రజాస్వామిక విధానాలపై కూడా గళం వినిపించాలని చెప్పారు. సమావేశాల్లో తన గురించి వ్యక్తిగతంగా మాట్లాడే ప్రయత్నాలు జరిగినా వాటిని పట్టించుకోవద్దని పార్టీ సభ్యులకు సూచించారు. అసెంబ్లీలో ప్రజల అజెండానే బీఆర్ఎస్ అజెండాగా ఉండాలని కేసీఆర్ స్పష్టం చేశారు.
#KCR #KCRNews #BRS #BRSMLAs #BRSMLC #CongressGovernment #TelanganaCongress #RevanthReddy #KCRMeeting #Erravalli #BRSAssemblyStrategy #TelanganaAssembly #KTR #HarishRao #Kaleshwaram #PalamuruRangaReddy #KrishnaRiver #GodavariRiver #TelanganaIrrigation #TelanganaPolitics #FarmersIssues











