సరిహద్దులో ఐపీఎస్ అధికారి రోల్ .
అజిత్ దోవల్ మైండ్ బ్లోయింగ్ జ్ఞాపకాలు.
సిక్కిం భారతదేశంలో విలీనమవుతున్న సమయంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ యువ ఐపీఎస్ అధికారిగా అక్కడ ఇంటెలిజెన్స్ బాధ్యతలు చేపట్టారు. అప్పటికి ఆయన వయసు ఇరవైలలోనే. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా నిర్వహించడం, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కదలికలను గమనించడం ఆయన ప్రధాన బాధ్యతల్లో భాగంగా ఉండేది. సిక్కిం అప్పటికి భారతదేశంలో పూర్తిగా విలీనం కాలేదు.
గడువు దాటినా జాడలేక
సిక్కిం-చైనా సరిహద్దు ప్రాంతంలో ఓ నిఘా బృందాన్ని ప్రత్యేక ఆపరేషన్‌కు పంపారు. ఎనిమిది రోజుల్లో తిరిగి రావాల్సిన బృందం రోజులు గడిచినా కనిపించలేదు. ఐదు రోజులు, పది రోజులు, పదిహేను రోజులు గడుస్తున్నా ఎలాంటి సమాచారం రాలేదు. మంచు తుఫాను, అవలాంచ్ వంటి ప్రమాదాలపై కూడా సమాచారం లేదు. బృందంలోని సభ్యులు సురక్షితంగా ఉన్నారో లేదో తెలియక దోవల్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
చైనా కస్టడీలో ఉన్నారన్న సమాచారం
ఇంతలో హెడ్‌క్వార్టర్స్ నుంచి దోవల్‌కు ఫోన్ వచ్చింది. “మీరు కొంతమందిని సరిహద్దు దాటి పంపారా?” అని ఉన్నతాధికారి ప్రశ్నించారు. కొద్దిసేపటికే అసలు విషయం తెలిసింది. ఆ బృందాన్ని చైనా సైన్యం పట్టుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. కొంతకాలం తర్వాత చర్చలు, సంప్రదింపులు లేదా ఏదైనా ఒప్పందం అనంతరం వారిని చైనా తిరిగి పంపింది. అయితే అప్పటికే వారు తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితిలో ఉన్నారని దోవల్ గుర్తుచేశారు.
విచారణతో బయటపడిన అసలు కారణం
ఈ ఘటనపై అధికారిక విచారణ ప్రారంభమైంది. తన కెరీర్ ఇక ముగిసిపోయిందని అప్పట్లో భావించానని దోవల్ చెప్పారు. అయితే విచారణలో ఆయన తప్పు చేసినట్లు తేలలేదు. హెడ్‌క్వార్టర్స్ అందించిన మ్యాపులు, స్కెచ్లలో లోపాలు ఉన్నట్లు వెల్లడైంది. 1975లో సిక్కిం భారతదేశంలో 22వ రాష్ట్రంగా విలీనం అయింది. అంతకుముందు 1950 ఒప్పందం ప్రకారం సిక్కిం భారత రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార సంబంధాల పరిధిలో ఉన్నా అంతర్గత పాలన మాత్రం స్వయం ప్రతిపత్తితో కొనసాగింది.
#AjitDoval #AjitDovalStory #Sikkim #SikkimMerger #China #ChinaIndiaBorder #IntelligenceMission #ChineseCustody #IPSOfficer #IndianIntelligence #Sikkim1975 #IITRoorkee #NationalSecurityAdvisor #IndiaChinaRelations #BorderSecurity











