Home National_news అసలు యుద్ధం మొదలు

అసలు యుద్ధం మొదలు

11


మూడింట రెండొంతుల మెజారిటీ వేట.
పార్లమెంట్‌లో కొత్త రాజకీయ సమీకరణాలు.
వర్షాకాల సమావేశాలపై బీజేపీ ఫోకస్.

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న వేళ కేంద్ర ప్రభుత్వానికి సంఖ్యాబలం అతిపెద్ద సవాలుగా మారింది. రెండు కీలక రాజ్యాంగ సవరణ బిల్లులను ఆమోదింపజేయడమే ఎన్డీయే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు 30 రోజుల పాటు జైలులో ఉంటే పదవి నుంచి తొలగించే 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ఒకటి. మహిళల రిజర్వేషన్ల అమలును డీలిమిటేషన్‌తో అనుసంధానించే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు మరోటి. ఇవి సాధారణ బిల్లులు కాకపోవడంతో మూడింట రెండొంతుల ప్రత్యేక మెజారిటీ తప్పనిసరి కావడం రాజకీయ సమీకరణాలను మరింత ఆసక్తికరంగా మార్చింది.

ఏప్రిల్‌లో ఎదురుదెబ్బ

గత ఏప్రిల్‌లో డీలిమిటేషన్‌ బిల్లును ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టినా ఆమోదం పొందలేకపోయింది. మొత్తం 528 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. అనుకూలంగా 298 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 230 ఓట్లు నమోదయ్యాయి. ప్రత్యేక మెజారిటీకి అవసరమైన 352 ఓట్లకు ప్రభుత్వం 54 ఓట్లు తక్కువగా నిలిచింది. దీంతో బిల్లు ఆగిపోయింది. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసే వ్యూహంపై ఎన్డీయే దృష్టి పెట్టింది.

మారుతున్న సమీకరణాలు

ఇటీవలి రాజకీయ పరిణామాలు అధికార కూటమికి ఆశలు పెంచుతున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన 20 మంది తిరుగుబాటు ఎంపీలు కొత్త రాజకీయ వేదిక ఏర్పాటు చేసి ఎన్డీయేకు మద్దతు ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారనే చర్చ జరుగుతోంది. మరోవైపు తమిళనాడులో డీఎంకేకు కాంగ్రెస్‌తో దూరం పెరుగుతోందనే ప్రచారం కూడా కొనసాగుతోంది. ఈ పరిణామాలు లోక్‌సభలో బిల్లుల ఆమోదానికి ఉపయోగపడతాయని ఎన్డీయే వర్గాలు భావిస్తున్నాయి.

లోక్‌సభలో సంఖ్యల లెక్క

ప్రస్తుతం లోక్‌సభలో మొత్తం సభ్యుల సంఖ్య 540. ప్రత్యేక మెజారిటీకి 360 ఓట్లు అవసరం. ఎన్డీయే వద్ద ప్రస్తుతం 292 మంది సభ్యుల బలం ఉంది. తృణమూల్‌ తిరుగుబాటు ఎంపీలు చేరితే బలం 312కు చేరుతుంది. శివసేన ఉద్ధవ్‌ వర్గానికి చెందిన ఆరుగురు మద్దతిస్తే 318 అవుతుంది. డీఎంకేకు చెందిన 22 మంది సభ్యులు అనుకూలిస్తే సంఖ్య 340కు చేరుతుంది. ఎన్సీపీ శరద్‌ పవార్‌ వర్గానికి చెందిన ఎనిమిది మంది మద్దతు ఇస్తే మొత్తం 348 అవుతుంది. అయినా ప్రత్యేక మెజారిటీకి ఇంకా 12 ఓట్లు తక్కువే. ఈ లోటు భర్తీ చేసేందుకు వైఎస్సార్‌సీపీ, జేఎంఎం, వీసీకే, అకాలీదళ్‌, స్వతంత్ర సభ్యుల మద్దతు అవసరం కావచ్చు.

కీలకంగా గైర్హాజరు వ్యూహం

కొన్ని పార్టీలు ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వకుండా ఓటింగ్‌కు దూరంగా ఉండే అవకాశం కూడా చర్చలో ఉంది. అలాంటి పరిస్థితిలో ఓటింగ్‌లో పాల్గొనే సభ్యుల సంఖ్య తగ్గిపోతుంది. దీంతో ప్రత్యేక మెజారిటీకి అవసరమైన సంఖ్య కూడా తగ్గుతుంది. తృణమూల్‌ తిరుగుబాటు ఎంపీలు, డీఎంకే, శివసేన ఉద్ధవ్‌ వర్గం, ఎన్సీపీ శరద్‌ పవార్‌ వర్గం ఓటింగ్‌కు దూరంగా ఉంటే మొత్తం ఓటింగ్‌ సభ్యుల సంఖ్య 484కు పడిపోతుంది. అప్పుడు ప్రత్యేక మెజారిటీ లక్ష్యం 323కు తగ్గుతుంది. అయినప్పటికీ ఎన్డీయేకు ఇంకా 31 ఓట్లు అవసరం అవుతాయి.

రాజ్యసభలోనూ కఠిన పరీక్షే

రాజ్యసభలో కూడా ప్రభుత్వం సులభంగా గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం సభలో 242 మంది సభ్యులు ఉన్నారు. ప్రత్యేక మెజారిటీకి 162 ఓట్లు అవసరం. ఎన్డీయే వద్ద సుమారు 150 మంది సభ్యుల బలం ఉంది. డీఎంకేకు చెందిన ఎనిమిది మంది, ఎన్సీపీ శరద్‌ పవార్‌ వర్గానికి చెందిన ఒక సభ్యుడు మద్దతిస్తే సంఖ్య 159కు చేరుతుంది. పశ్చిమ బెంగాల్‌లో జరగనున్న ఉపఎన్నికల ద్వారా మరో ముగ్గురు బీజేపీ సభ్యులు రాజ్యసభకు వస్తే బలం పెరిగే అవకాశం ఉంది. అయినా ప్రత్యేక మెజారిటీకి ఇంకా కొన్ని ఓట్లు తక్కువగానే ఉండే పరిస్థితి కనిపిస్తోంది.

ప్రతి ఓటు కీలకమే

వర్షాకాల సమావేశాల్లో ప్రతి ఓటు అత్యంత కీలకంగా మారనుంది. మద్దతులు, తిరుగుబాట్లు, గైర్హాజరు వ్యూహాలు, చిన్న పార్టీల నిర్ణయాలు బిల్లుల భవితవ్యాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. ఒకవైపు రాజ్యాంగ సవరణలపై ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగాలని చూస్తుండగా, మరోవైపు ప్రతిపక్షం ఐక్యంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. దీంతో ఈ సమావేశాలు సంఖ్యాబలం చుట్టూ తిరిగే రాజకీయ పోరాటానికి వేదికగా మారనున్నాయి.