Home AP నెల రోజుల్లో భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం!

నెల రోజుల్లో భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం!

75

కౌంట్ డౌన్ షురూ.
మోడీ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపు.


భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమానాశ్రయ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించాలని ఇప్పటికే ఆహ్వానం పంపినట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి తేదీ ఖరారైన వెంటనే ప్రారంభోత్సవాన్ని నిర్వహిస్తామని స్పష్టం చేశారు. భోగాపురం విమానాశ్రయానికి కేంద్ర హోంశాఖ కీలక గుర్తింపు ఇచ్చింది. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్–2025 పరిధిలోకి తీసుకువస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో భోగాపురం విమానాశ్రయం కేటగిరీ-1 జాబితాలో 39వ స్థానంలో చేరింది. అదే సమయంలో ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్‌గా కూడా సేవలు అందించే అర్హత పొందింది.

అంతర్జాతీయ ప్రయాణాలకు ఊతం

ఈ గుర్తింపుతో విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు భోగాపురం విమానాశ్రయం ద్వారా నేరుగా ప్రయాణించే అవకాశం కలుగుతుంది. ఇమ్మిగ్రేషన్ సేవలు అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఈ విమానాశ్రయం కీలక కేంద్రంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైతే ఉత్తరాంధ్రకు భారీ పెట్టుబడులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. పర్యాటకం, పారిశ్రామిక రంగం, ఎగుమతులు వేగం పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రానికి అంతర్జాతీయ అనుసంధానం మరింత బలపడటంతో విశాఖపట్నం ప్రాంత అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలవనుంది.