Home Educational_News నీట్‌ రీ-ఎగ్జామ్ ఫలితాలు విడుదల

నీట్‌ రీ-ఎగ్జామ్ ఫలితాలు విడుదల

15


11.21 లక్షల మంది అర్హత.
ఫలితాలు ప్రకటించిన ఎన్‌టీఏ.

నీట్‌ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ ఎన్‌టీఏ విడుదల చేసింది. వైద్య, దంత, ఆయుష్‌ సహా అనుబంధ కోర్సుల్లో ప్రవేశాలకు మొత్తం 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. జూన్‌ 21న నిర్వహించిన రీ-ఎగ్జామ్‌కు దేశవ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది హాజరయ్యారు. భారత్‌లో 551 నగరాలు, విదేశాల్లో 14 నగరాల్లో 5,440 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆలస్యం కాకుండా ఉండేలా ఫలితాలను ప్రకటించినట్లు ఎన్‌టీఏ వెల్లడించింది.

టాపర్లుగా ఇద్దరు విద్యార్థులు

ఈ ఏడాది గరిష్ఠంగా 720 మార్కులకు గాను 715 మార్కులు సాధించి పంజాబ్‌కు చెందిన ఆర్యన్‌ గుప్తా, హర్యానాకు చెందిన పన్‌షుల్‌ బన్సాల్‌ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. మొత్తం 138 మంది విద్యార్థులు 690 మార్కులకు పైగా సాధించారు. వారిలో 93 శాతానికి పైగా తొలిసారి నీట్‌ రాసిన అభ్యర్థులే కావడం విశేషం. టాప్‌ స్కోరర్లలో 99 శాతం మంది 17 నుంచి 19 సంవత్సరాల వయసు గల విద్యార్థులే ఉన్నారు.

అమ్మాయిలదే పైచేయి

ఈసారి అర్హత సాధించిన వారిలో మహిళలే అధికంగా ఉన్నారు. మొత్తం అర్హత పొందిన అభ్యర్థుల్లో 58 శాతానికి పైగా మహిళలే ఉన్నట్లు ఎన్‌టీఏ తెలిపింది. మహిళల అర్హత శాతం 56.8గా నమోదు కాగా, పురుషుల అర్హత శాతం 55.1గా ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అభ్యర్థులు అర్హత సాధించారు. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 1.7 లక్షల మందికి పైగా అర్హత పొందగా, లక్షద్వీప్‌లో 43 మంది మాత్రమే అర్హత సాధించారు.

కౌన్సెలింగ్‌కు సిద్ధం

ఈసారి 19 మంది అభ్యర్థులు 700 మార్కులకు పైగా, 1,492 మంది 650 మార్కులకు పైగా, 10,160 మంది 600 మార్కులకు పైగా మార్కులు సాధించారు. ఆల్‌ ఇండియా కోటా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్లకు మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది. రాష్ట్ర కోటా సీట్లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ చేపట్టనున్నాయి. కేటగిరీల వారీగా కట్‌ఆఫ్‌లు, టాపర్ల వివరాలు, ఇతర గణాంకాలను కూడా ఎన్‌టీఏ అధికారికంగా విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల ప్రక్రియకు మార్గం సుగమమైంది.