Home Telangana సర్కారు చదువుల్లో సరికొత్త అధ్యాయం

సర్కారు చదువుల్లో సరికొత్త అధ్యాయం

67

ఆరుట్లలో విద్యా విప్లవానికి శ్రీకారం

తెలంగాణలో ప్రభుత్వ విద్యకు కొత్త దిశను చూపించే కీలక ఘట్టానికి ఆరుట్ల వేదిక కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్, టీపీఎస్ ప్రారంభంతో సర్కారు విద్యలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అత్యాధునిక వసతులు, నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్య, ఉచిత రవాణా, పోషకాహార సదుపాయాలతో ఈ పాఠశాల రూపుదిద్దుకుంది. పేద, మధ్యతరగతి విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాల విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ నమూనా విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా వంద పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది.

పైలాన్ ఆవిష్కరణతో సీఎం పర్యటన ప్రారంభం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం 9:30 గంటలకు ఆరుట్ల గ్రామానికి చేరుకుంటారు. అక్కడ నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలాన్‌ను ఆయన ఆవిష్కరిస్తారు. అనంతరం పాఠశాల ఆవరణలోని అత్యాధునిక డిజిటల్ తరగతి గదులు, గ్రంథాలయం, సైన్స్ ప్రయోగశాలలు, విశాలమైన డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను సీఎం స్వయంగా పరిశీలిస్తారు. అక్కడ చదువుకుంటున్న విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఉపాధ్యాయులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడతారు.

కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే వసతులు
ఈ పాఠశాల రూపకల్పన కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. విద్యా కమిషన్ చైర్మన్ డాక్టర్ ఆకునూరి మురళి, కమిటీ సభ్యుల ప్రత్యేక పర్యవేక్షణలో ఆరుట్ల స్కూల్ అద్భుతంగా రూపుదిద్దుకుంది. ఇక్కడ నర్సరీ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే క్యాంపస్‌లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన సాగుతుంది. కేవలం చదువే కాకుండా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, సాంస్కృతిక కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. పిల్లలకు ఉచిత బస్సు సౌకర్యం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ ఉచితంగా అందిస్తారు.

మొదటి విడతలో నాలుగు పైలట్ ప్రాజెక్టులు
తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ విధానాన్ని పరీక్షించడానికి ప్రభుత్వం మొదటి విడతగా నాలుగు పాఠశాలలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసింది. రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాల పాఠశాలలతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని వంగూరు, పోల్కంపల్లి స్కూళ్లను ఇందుకు ఎంపిక చేశారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కాగానే, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఒక స్పష్టమైన కార్యాచరణను సిద్ధం చేసుకుంది.

అడ్మిషన్ల కోసం తల్లిదండ్రుల క్యూ
ఆరుట్ల పబ్లిక్ స్కూల్‌లో ప్రైవేట్ పాఠశాలలను మించిన వసతులు కల్పించడంతో స్థానికంగా అపూర్వ స్పందన లభిస్తోంది. చుట్టుపక్కల గ్రామాల పిల్లల కోసం ప్రభుత్వం ఐదు ప్రత్యేక స్కూల్ బస్సులను నడుపుతోంది. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న తమ పిల్లలను సైతం తల్లిదండ్రులు ఈ ప్రభుత్వ స్కూల్‌లో చేర్పించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు మొత్తం 1,814 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరగడంతో పాఠశాల యాజమాన్యం “నో అడ్మిషన్” బోర్డు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.