Home Telangana వినాయక మండపాలకు ఉచిత కరెంట్‌

వినాయక మండపాలకు ఉచిత కరెంట్‌

గణేశ్‌ ఉత్సవాలపై రేవంత్‌ ప్రత్యేక సమీక్ష.
రూపాయి ఖర్చు లేకుండా విద్యుత్‌ సౌకర్యం.

వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ఉత్సవాల సందర్భంగా భక్తులు, మండప నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సచివాలయంలో పోలీస్‌, మున్సిపల్‌ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ఉత్సవ కమిటీలతో సమీక్ష నిర్వహించారు. పండుగ నిర్వహణలో క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేశ్‌ మండపాలకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని సీఎం తెలిపారు. మండప నిర్వాహకులు సంబంధిత అధికారులకు ముందుగానే దరఖాస్తు చేసుకుని ఈ సదుపాయం పొందాలని సూచించారు. మండపాల వివరాలను స్థానిక పోలీస్‌ స్టేషన్లలో నమోదు చేయాలని కోరారు. దీనివల్ల ట్రాఫిక్‌ సమస్యలను ముందుగానే నియంత్రించడంతో పాటు, భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టంగా చేపట్టేందుకు పోలీసులకు అవకాశం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.

చెరువుల వద్ద పటిష్ట నిమజ్జన ఏర్పాట్లు

గణేశ్‌ విగ్రహాల నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చెరువుల వద్ద ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. బతుకమ్మ ఉత్సవాల కోసం అభివృద్ధి చేస్తున్న చెరువుల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో, గణేశ్‌ నిమజ్జనాలకు కూడా అదే స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పెద్ద విగ్రహాలను సురక్షితంగా నిమజ్జనం చేసేందుకు వీలుగా చెరువు గట్లు, పరిసర ప్రాంతాలను సిద్ధం చేయాలని, పెద్ద క్రేన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి 24 గంటల పాటు నిరంతర పర్యవేక్షణ కొనసాగాలని సూచించారు. పోలీస్‌, మున్సిపల్‌ అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. “హైదరాబాద్‌ ప్రశాంతంగా, సురక్షితంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి.. యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి” అని సీఎం పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు, ఉత్సవ కమిటీలు సహకరించాలని కోరారు. మండప నిర్వాహకులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు.

 

#RevanthReddy #GaneshChaturthi #GaneshFestival #GaneshMandap #FreeElectricity #FreePower #TelanganaGovernment #TelanganaGaneshFestival #GaneshChaturthi2026 #HyderabadGanesh #GaneshVisarjan #GaneshImmersion #Hyderabad #Telangana #GaneshMandapRegistration #GaneshFestivalSecurity #HyderabadPolice #HyderabadTraffic #TelanganaNews #RevanthReddyNews