’రైతు ఆశీర్వాద సభ’ కాదు..
’రైతు క్షమాపణ సభ’ పెట్టుకోండి.!
కాంగ్రెస్ హామీలపై హరీష్ రావు ఫైర్
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను, రైతులను ఘోరంగా వంచించిందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వంద రోజుల్లో హామీలు నెరవేర్చకపోతే నిలదీయమన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాటలను ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు తాము నిలదీయడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. గత కేసీఆర్ ప్రభుత్వం కరోనా కష్టకాలంలో కూడా రైతుబంధు నిధులను సకాలంలో అందించిందని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చాక రైతులకు ఇవ్వాల్సిన వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టారని మండిపడ్డారు.
రైతు ఆశీర్వాదం కాదు క్షమాపణ చెప్పాలి
భద్రాద్రి రాముడి సాక్షిగా రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చివరకు ఆ దేవుడినే మోసం చేశారని హరీశ్ రావు ఆరోపించారు. వడ్ల కొనుగోళ్లలో తరుగు పేరుతో రైతులను దళారుల చేతుల్లో పెట్టారని విమర్శించారు. త్వరలోనే మధిరలో నిర్వహించబోయే సభకు ‘రైతు ఆశీర్వాద సభ’ అని పేరు పెట్టడం రైతాంగాన్ని అవమానించడమేనన్నారు. రైతులను మోసం చేసినందుకు గానూ దానికి ‘రైతు క్షమాపణ సభ’గా పేరు మార్చుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు. వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టి ఉచిత విద్యుత్ ను దూరం చేయాలని చూస్తున్నారని హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి వైఫల్యాల పాలన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఆయన వద్ద ఉన్న విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్ శాఖలు మూడూ అట్టర్ ప్లాప్ అయ్యాయని విమర్శించారు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణలో సీఎం పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. కేవలం ఢిల్లీ పెద్దలకు సంచులు మోసే శాఖలో మాత్రమే ముఖ్యమంత్రి పాసయ్యారంటూ ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో కొత్తగా ఒక్క ప్రాజెక్టు కట్టకపోగా, ఉన్న ప్రాజెక్టులను కూడా కాపాడుకోలేని చేతకాని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.
ఇందిరమ్మ రాజ్యంలో ఇళ్ల కూల్చివేతలు
ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా హరీశ్ రావు ఇందిరమ్మ రాజ్యం పేరుతో జరుగుతున్న అరాచకాలను ఎండగట్టారు. పేదలకు గూడు కల్పించాల్సిన ప్రభుత్వమే వారి ఇళ్లను కూల్చివేయడం, భూములను లాక్కోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ మంత్రి హయాంలోనే పేదల ఇళ్లు లాక్కోవడం దారుణమన్నారు. రేవంత్ రెడ్డి తనకు హిట్లర్ ఆదర్శమని చెప్పుకుంటూ ‘హైడ్రా’ పెట్టారని విమర్శించారు. అహంకారంతో ప్రవర్తించే వారే హిట్లర్ ను ఆదర్శంగా తీసుకుంటారని, ఈ పాలన అంతా బ్లాక్ మెయిల్ చందంగా మారిందని ధ్వజమెత్తారు.
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై పోరాటం
ఖమ్మం జిల్లాలోని జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై హరీశ్ గళమెత్తారు. హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు స్థలాలు ఇస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి, ఖమ్మం జర్నలిస్టులు చేసిన పాపం ఏంటని ప్రశ్నించారు. వారికి తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు తాను దగ్గరుండి పోరాటం చేస్తానని భరోసా ఇచ్చారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
#HarishRao #BRS #CongressGovernment #RevanthReddy #TelanganaPolitics #FarmerIssues #RythuBandhu #RythuBharosa #LoanWaiver #BhattiVikramarka #Khammam #PoliticalNews #TelanganaNews #FarmerProtest #HarishRaoSpeech











