Home Telangana నాకు తక్కువేంటి? కమిషన్లు నాకెందుకు? దేవుడు అన్నీ ఇచ్చాడు!

నాకు తక్కువేంటి? కమిషన్లు నాకెందుకు? దేవుడు అన్నీ ఇచ్చాడు!

విద్యే తెలంగాణ భవిష్యత్.
తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు.
జెన్‌ ఆల్ఫా.. జెన్‌ బీటాపైనే ఫోకస్‌.
విద్యపై అసెంబ్లీలో సీఎం రేవంత్ .

తెలంగాణ విద్యా విధానంపై శాసనసభలో చర్చ జరగడం శుభ పరిణామమని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. సభ్యులు ఇచ్చే సూచనలు, సలహాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని తాను బలంగా నమ్ముతున్నట్లు చెప్పారు. అందరూ జెన్‌ జీ గురించి ఆలోచిస్తుంటే.. తాను జెన్‌ ఆల్ఫా, జెన్‌ బీటా తరాల గురించి ఆలోచిస్తున్నానని రేవంత్‌ పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ విద్యా విధానాలను తెలంగాణకు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ విద్య, సాగునీటికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు. దేశంలోని అనేక ప్రముఖ విద్యా సంస్థలకు నెహ్రూ వేసిన పునాదులే ఆధారమని చెప్పారు. తెలంగాణలోని ప్రస్తుత విశ్వవిద్యాలయాల్లో చాలా వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలోనే ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. విద్య ఒక్కటే జీవితాల్లో వెలుగులు నింపగలదన్నది తన సంపూర్ణ విశ్వాసమని సీఎం స్పష్టం చేశారు.

విద్యా బడ్జెట్‌ భారీగా పెంపు

తెలంగాణలో విద్యకు కేటాయింపులు గణనీయంగా పెంచామని సీఎం వివరించారు. 2023-24లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యాశాఖకు సుమారు రూ.19 వేల కోట్ల బడ్జెట్‌ కేటాయించగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం 2024-25లో రూ.21,292 కోట్లు, 2025-26లో రూ.23,108 కోట్లు, 2026-27లో రూ.26,647 కోట్లు కేటాయించిందని తెలిపారు. అంటే కేవలం మూడేళ్లలో విద్యాశాఖ బడ్జెట్‌ను రూ.7,554 కోట్ల మేర పెంచినట్లు చెప్పారు. విద్య కోసం రాష్ట్ర బడ్జెట్‌లో 15 శాతం కేటాయింపుల దిశగా ముందుకు వెళ్లడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. తాను ముఖ్యమంత్రిగా విద్యాశాఖను స్వయంగా నిర్వహించడం ఆ శాఖకు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని చెప్పారు. విద్యాశాఖపై తనకు ప్రత్యేకమైన ప్యాషన్‌ ఉందని రేవంత్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖను సమీక్షిస్తే మొత్తం విద్యా వ్యవస్థ సమీక్షలోకి వస్తుందని వివరించారు. రాష్ట్రంలో సామాజిక వెనుకబాటుకు ప్రధాన కారణం ఆస్తులు, అంతస్తులు కాకుండా విద్యకు దూరంగా ఉండటమేనని ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో తేలిందని తెలిపారు. ప్రపంచంతో పోటీ పడాలంటే విద్యా విధానంలో మార్పులు అవసరమని, అందుకోసం కొత్త విద్యా విధానాన్ని రూపొందించేందుకు విద్యా కమిషన్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. కమిషన్‌ నివేదికను పరిశీలించేందుకు కేకే నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశామని, సభ్యుల సూచనలు ఆ కమిటీకి అందించాలని కోరారు.

రికార్డు స్థాయిలో టీచర్ల నియామకాలు

అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 55 రోజుల్లో 10,006 మంది ఉపాధ్యాయుల నియామకాలు పూర్తి చేశామని రేవంత్‌ చెప్పారు. ఎలాంటి చిన్న ఆరోపణకు కూడా తావులేకుండా నియామకాలు చేపట్టామని తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లలో కేవలం 7,857 మంది టీచర్లను మాత్రమే నియమించిందని వివరించారు. తాను విద్యాశాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 86 వేల మేర పెరిగిందని చెప్పారు. ఇది విద్యాశాఖ మంత్రిగా తన పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. జెన్‌ ఆల్ఫా, జెన్‌ బీటా తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త విద్యా విధానాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా విధానాలు, బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ను తెలంగాణలో అమలు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

పాలిటెక్నిక్‌లపై క్లారిటీ.. ప్రైవేటీకరణ లేదు

పాలిటెక్నిక్‌ కళాశాలల ప్రైవేటీకరణపై జరుగుతున్న ప్రచారం వంద శాతం అవాస్తవమని సీఎం రేవంత్‌ రెడ్డి తేల్చిచెప్పారు. పాలిటెక్నిక్‌ కళాశాలలు ఇప్పటివరకు ఎలా ఉన్నాయో అదే విధంగా కొనసాగుతాయని తెలిపారు. మూడేళ్ల డిప్లొమా కోర్సు, అకడమిక్‌ హోదా యథాతథంగా ఉంటాయని స్పష్టం చేశారు. అవసరమైతే జీవో ఎంఎస్‌ నెం.97లో సవరణలు చేస్తామని చెప్పారు. ఇంజినీరింగ్‌లో రెండో సంవత్సరానికి లేటరల్‌ ఎంట్రీ అవకాశాలు కొనసాగుతాయని తెలిపారు. విద్యార్థులకు నష్టం కలిగించే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. స్కిల్‌ యూనివర్సిటీలకు ఏఐసీటీఈ అనుమతులు తీసుకొస్తున్నామని చెప్పారు. ఏటీసీల భూములు తీసుకోలేదని, అదనంగా 282 ఎకరాలు కేటాయించామని వెల్లడించారు. విద్యార్థులకు మరిన్ని నైపుణ్య అవకాశాలు కల్పించేందుకే స్కిల్‌ యూనివర్సిటీలను తీసుకొచ్చామని వివరించారు. విద్యాశాఖపై తనపై వచ్చిన ఆరోపణలపైనా సీఎం స్పందించారు. కమీషన్లు తీసుకోవాల్సిన అవసరం తనకు లేదని, గత 17 ఏళ్లలో జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, పీసీసీ అధ్యక్షుడు, సీఎం వంటి పదవులు వరుసగా వచ్చాయని చెప్పారు. తనకు డబ్బు సంపాదించడమే లక్ష్యం కాదని, ప్రశాంతంగా జీవించడమే ముఖ్యమని పేర్కొన్నారు. మొత్తంగా విద్యను తెలంగాణ భవిష్యత్తుకు ప్రధాన పునాదిగా మార్చడమే తన లక్ష్యమని రేవంత్‌ రెడ్డి అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు.

#RevanthReddy #TelanganaEducation #TelanganaEducationPolicy #RevanthReddyEducation #TelanganaEducationBudget #GenAlpha #GenBeta #TeacherRecruitment #TelanganaTeachers #10006TeacherJobs #TelanganaAssembly #PolytechnicColleges #SkillUniversities #TelanganaGovernment #CongressGovernment #TelanganaPolitics #EducationPolicy #EducationBudget #TelanganaNews #RevanthReddySpeech