వాణిజ్య లోటుపై దృష్టి.
ఏడేళ్ల తర్వాత ఢిల్లీకి షీ జిన్‌పింగ్.
ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నేడు న్యూఢిల్లీలో కీలక ద్వైపాక్షిక భేటీ నిర్వహించనున్నారు. బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో జరగనున్న ఈ సమావేశం ఇరు దేశాల సంబంధాల్లో కీలక ఘట్టంగా మారనుంది. షీ జిన్‌పింగ్ గతంలో 2016లో గోవాలో జరిగిన బ్రిక్స్ సదస్సుకు, తర్వాత మహాబలిపురంలో జరిగిన అనధికారిక భేటీకి భారత్ వచ్చారు. అయితే 2014 తర్వాత ఢిల్లీకి ఆయన రావడం ఇదే తొలిసారి. 2020 తర్వాత ఇరు దేశాల నేతల మధ్య ద్వైపాక్షిక పర్యటనలు కూడా జరగలేదు. గల్వాన్ ఘర్షణ తర్వాత దెబ్బతిన్న సంబంధాల్లో ఇటీవల కొంత కదలిక కనిపిస్తున్నా, దీనిని ఇప్పుడే పూర్తిస్థాయి ‘రీ-సెట్’గా చెప్పలేమని నిపుణులు భావిస్తున్నారు. గతేడాది మోదీ చైనా పర్యటనతో ఏర్పడిన సానుకూల వాతావరణాన్ని ఈ సమావేశం మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. రాజకీయ, సైనిక స్థాయిలో స్థిరమైన సంభాషణ కొనసాగించడమే ఇరు దేశాల ముందున్న ప్రధాన అవసరంగా కనిపిస్తోంది.
అరుణాచల్ సహా సరిహద్దే కీలకం
మోదీ–షీ చర్చల్లో సరిహద్దు శాంతి, స్థిరత్వం అత్యంత కీలక అంశంగా ఉండనుంది. తూర్పు లద్దాఖ్‌లో సైనిక ప్రతిష్ఠంభనకు సంబంధించిన సమస్యల పరిష్కారం తర్వాత ఉన్నతస్థాయి చర్చలను తిరిగి ప్రారంభించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతను పర్యవేక్షించడంతో పాటు వివాదానికి న్యాయబద్ధమైన, సహేతుకమైన, పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ప్రత్యేక ప్రతినిధులు పనిచేయాలని ఇంతకుముందే నిర్ణయించారు. అరుణాచల్ ప్రదేశ్ సహా సరిహద్దు అంశాలపై చైనా వైఖరి భారత్‌కు నిరంతర ఆందోళనగా ఉంది. అందుకే సరిహద్దులో శాంతి లేకుండా ద్వైపాక్షిక సంబంధాల్లో దీర్ఘకాలిక పురోగతి సాధ్యం కాదన్న విషయాన్ని మోదీ స్పష్టం చేసే అవకాశం ఉంది. అదే సమయంలో ఇరు దేశాలు పోటీదారులు కాకుండా అభివృద్ధిలో పరస్పర అవకాశాలుగా చూడాలని చైనా కూడా సంకేతాలు ఇస్తోంది. దీంతో ఈ భేటీ కేవలం దౌత్య మర్యాదల సమావేశంగా కాకుండా సంబంధాలను స్థిరీకరించే ప్రయత్నంగా మారే అవకాశం ఉంది.
112 బిలియన్ డాలర్ల లోటు.. భారత్ ప్రశ్న
సరిహద్దుతో పాటు భారత్–చైనా వాణిజ్య అసమతుల్యత కూడా మోదీ ముందుకు తీసుకురానున్న ప్రధాన అంశం. 2026 మార్చితో ముగిసిన ఏడాదిలో ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో 151.1 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే అదే సమయంలో భారత్ వాణిజ్య లోటు 112.16 బిలియన్ డాలర్లకు పెరిగింది. చైనా నుంచి భారీగా దిగుమతులు చేసుకుంటున్న భారత్‌కు సమానమైన మార్కెట్ అవకాశాలు లభించడం లేదన్న ఆందోళన ఉంది. అందుకే న్యాయమైన మార్కెట్ యాక్సెస్, సరఫరా గొలుసుల స్థిరత్వం, ఎగుమతులకు మరిన్ని అవకాశాలు భారత్ ప్రధానంగా కోరనుంది. మరోవైపు కొంత సానుకూల మార్పు కూడా కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులు పునరుద్ధరించబడ్డాయి. చైనా వ్యాపారవేత్తలకు భారత్ వీసా ప్రక్రియను సులభతరం చేసింది. ఆరేళ్ల విరామం తర్వాత సరిహద్దు వాణిజ్యం కూడా తిరిగి ప్రారంభమైంది. సిక్కింలోని నాథులా మార్గం సహా కీలక వాణిజ్య మార్గాలు మళ్లీ తెరుచుకున్నాయి. అయినప్పటికీ ఇవన్నీ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. అందుకే మోదీ–షీ భేటీకి అసలు పరీక్ష సరిహద్దు శాంతి, వాణిజ్య సమతుల్యతే. ఈ రెండు అంశాల్లో పురోగతి కనిపిస్తేనే తాత్కాలిక సానుకూలత శాశ్వత సంబంధాల దిశగా మారే అవకాశం ఉంటుంది.
#ModiXiMeeting #NarendraModi #XiJinping #IndiaChinaRelations #IndiaChina #IndiaChinaBorder #BorderPeace #ArunachalPradesh #ChinaIndiaTrade #TradeDeficit #BRICS2026 #BRICSSummit #IndiaChinaDiplomacy #Geopolitics #IndiaForeignPolicy











