డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు వస్తా.
అధికారం కాదు… ప్రజలే లక్ష్యం.
బంగ్లా మాజీ ప్రధాని హసీనా ప్రకటన.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మరోసారి స్వదేశానికి తిరిగి వస్తానని స్పష్టం చేశారు. తనకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా వెనక్కి తగ్గబోనని ప్రకటించారు. జైలుకు పంపినా, ప్రాణహాని కలిగినా ప్రజల మధ్యకే వస్తానని చెప్పారు. తన రాక అధికారం కోసం కాదని, దేశాన్ని మళ్లీ అభివృద్ధి, లౌకికవాదం, శాంతి దిశగా నడిపించడమే లక్ష్యమని వివరించారు.
డిసెంబర్‌లో తిరుగు ప్రయాణం
వీడియో ద్వారా మీడియాతో మాట్లాడిన హసీనా, బంగ్లాదేశ్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దూరంగా ఉండలేనని చెప్పారు. డిసెంబరు విజయ మాసం కావడంతో అదే నెలలో స్వదేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తనకు ఏం జరిగినా ప్రజలతోనే ఉంటానని స్పష్టం చేశారు. ప్రసంగం ప్రారంభంలో దేశ వ్యవస్థాపకుడు బంగబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్‌కు నివాళి అర్పించిన హసీనా భావోద్వేగానికి గురయ్యారు. 1975 ఆగస్టు 15న సైనిక తిరుగుబాటులో తండ్రితో పాటు కుటుంబ సభ్యులను కోల్పోయిన ఘటనను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. స్వదేశం విడిచి వెళ్లాల్సి వచ్చినా ప్రజలతో తన అనుబంధం ఎప్పుడూ తెగిపోలేదని చెప్పారు.
2024 అశాంతిపై కీలక ఆరోపణలు
2024 జూలై, ఆగస్టులో జరిగిన అశాంతి ఘటనలను హసీనా ప్రస్తావించారు. వాటిని కేవలం విద్యార్థుల శాంతియుత ఉద్యమంగా చూడలేమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం మార్చేందుకు ముందుగానే ప్రణాళికతో నిర్వహించిన ప్రచారమని ఆరోపించారు. ఆ ఘటనల తర్వాత దేశంలో రాజకీయ వేధింపులు పెరిగాయని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటానికి ప్రపంచ దేశాలు మద్దతు ఇవ్వాలని హసీనా కోరారు. విముక్తి పోరాట స్ఫూర్తిని నమ్మిన వారెవరూ ప్రస్తుతం సురక్షితంగా లేరని వ్యాఖ్యానించారు. అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలు హత్యలు, అరెస్టులు, అదృశ్యాల బారిన పడుతున్నారని ఆరోపించారు. దేశంలో రాజకీయ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయని పేర్కొన్నారు. స్వదేశానికి తిరిగి వెళ్లి ప్రజల మధ్య నిలబడటమే తన తుది నిర్ణయమని మరోసారి స్పష్టం చేశారు.
#SheikhHasina #Bangladesh #BangladeshPolitics #AwamiLeague #SouthAsiaPolitics #BangladeshCrisis #HasinaReturn #BangladeshNews #Democracy #PoliticalDevelopments #SheikhMujiburRahman #InternationalNews #WorldPolitics











