“తమ్ముడు.. లెట్స్ డూ కుమ్ముడు” అన్నట్టుగా రేవంత్ అన్నదమ్ములు 22ఏ పేరుతో భూ దోపిడీకి తెగబడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని “అనుముల అనకొండలు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి 22ఏ నిషేధిత భూముల బాధితులతో మాట్లాడిన కేటీఆర్, ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో సుమారు 16 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ సంఖ్య కోటి 16 లక్షల ఎకరాలకు చేరిందని ఆరోపించారు. ప్రజల భూములను 22ఏ జాబితాలో చేర్చి హక్కులను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నవారు ప్రజల భూములను కాపాడాల్సింది పోయి వాటిపైనే కన్నేశారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి బయటకు పంపించారని ఆరోపించారు.
భూముల కోసం పోరాటం ఆగదు
తమపై ఎన్ని కుట్రలు పన్నినా 22ఏ బాధితుల తరఫున పోరాటం ఆపేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారిక రెవెన్యూ వ్యవస్థకు సమాంతరంగా మరో వ్యవస్థ పనిచేస్తోందని, భూముల వ్యవహారంలో పారదర్శకత లోపించిందని ఆరోపించారు. 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న ప్రైవేట్ భూములపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూమిని అమ్మేందుకు అంగీకరించని వారిని నిషేధిత జాబితా పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో బాధితుల వాదనలు విన్నామని, వారి సమస్యలను ప్రజల ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. భూమి హక్కుల కోసం అవసరమైతే ప్రజా ఉద్యమాన్ని మరింత విస్తరిస్తామని స్పష్టం చేశారు. “గజానికి ఒక గజ దొంగ ఉన్న ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం” అంటూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 22ఏ వ్యవహారంపై పూర్తి వివరాలను వెలుగులోకి తీసుకొచ్చి బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని కేటీఆర్ తేల్చిచెప్పారు.
#KTR #KTRNews #RevanthReddy #PonguletiSrinivasReddy #22ALands #22AProhibitedLands #TelanganaLandIssue #LandDispute #LandRights #BRS #BRSWorkingPresident #KTRComments #TelanganaPolitics #BRSNews #TelanganaGovernment #22AVictims #TelanganaLandRow #HarishRao #TelanganaNews











