రిజర్వాయర్ పక్కనే పేలుళ్లా?
అనుమతులు లేకుండా బ్లాస్టింగ్స్.
తిప్పారం గ్రామంలో ఇళ్లకు పగుళ్లు.
ప్రాజెక్టు భద్రతపై హరీశ్ రావు ఆందోళన.
సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ రిజర్వాయర్ సమీపంలో జరుగుతున్న బ్లాస్టింగ్స్‌పై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తిప్పారం గ్రామస్తుల ఫిర్యాదుతో రిజర్వాయర్ కట్టను, పేలుళ్లు జరుగుతున్న ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. జలమండలి పైప్‌లైన్లు, పంప్‌హౌస్ నిర్మాణాల కోసం కట్టకు సమీపంలో భారీ పేలుళ్లు జరుపుతున్నారని, దీంతో గ్రామంలోని ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయని స్థానికులు తన దృష్టికి తెచ్చినట్లు తెలిపారు. కట్టకు కేవలం 150 మీటర్ల దూరంలోనే అనుమతులు లేకుండా పేలుళ్లు జరుపుతున్నారన్నది ఆయన ప్రధాన ఆరోపణ. కట్ట ఎత్తు 40 మీటర్లు కాగా, నిబంధనల ప్రకారం 400 మీటర్ల పరిధిలో ఇలాంటి పనులు చేపట్టకూడదని హరీశ్‌రావు పేర్కొన్నారు. గత రెండు మూడు నెలలుగా రాత్రివేళల్లో జిలెటిన్ స్టిక్స్‌తో బండరాళ్లను పేల్చుతున్నారని ఆరోపించారు.
ఇళ్లకు పగుళ్లు.. అధికారుల మధ్య సమన్వయ లోపమా?
బ్లాస్టింగ్స్ కారణంగా తిప్పారం గ్రామంలోని ఇళ్లకు పగుళ్లు వచ్చాయని, రిజర్వాయర్ కట్ట సమీపంలో నీటి లీకేజీ పెరిగిందని గ్రామస్తులు చెబుతున్నారని హరీశ్‌రావు వెల్లడించారు. అనుమతులపై పోలీసు, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులను ప్రశ్నించగా స్పష్టమైన సమాధానం రాలేదని పేర్కొన్నారు. నీటిపారుదల శాఖ అనుమతులు లేకుండా పనులు చేయొద్దని జలమండలికి లేఖ రాసినా బ్లాస్టింగ్స్ కొనసాగుతున్నాయని ఆరోపించారు. మల్లన్న సాగర్ కట్టకు నష్టం జరిగితే లక్షల ఎకరాలకు సాగునీరు, పలు జిల్లాలకు తాగునీరు అందించే ప్రాజెక్టు భద్రతకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
బ్లాస్టింగ్స్ నిలిపివేయాలి.. రైతులకు న్యాయం చేయాలి
మల్లన్న సాగర్ భద్రతపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి బహిరంగ లేఖ రాసినట్లు హరీశ్‌రావు తెలిపారు. బ్లాస్టింగ్స్ తక్షణమే నిలిపివేయాలని, నిపుణులైన ఇంజినీర్లతో కట్టను పరిశీలించాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా పనులు చేపట్టిన వారిపై కేసులు నమోదు చేయాలని, దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం అందించాలని కోరారు. మరోవైపు, భూసేకరణలో పట్టా రైతులు, ఎస్సీ అసైన్డ్ రైతుల మధ్య పరిహారంలో వివక్ష చూపారని ఆరోపించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎకరాకు కనీసం రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతుల పక్షాన ప్రత్యక్ష పోరాటం చేస్తామని హెచ్చరించారు. కట్టకు నష్టం జరిగితే జలమండలే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
#MallannaSagar #HarishRao #ReservoirSafety #BlastingAllegations #ThipparamVillage #Siddipet #Telangana #BRS #IrrigationProjects #BundSafety #HouseCracks #WaterLeakage #UttamKumarReddy #LandAcquisition #TelanganaPolitics











