రూ.600కే వారం ప్రయాణం!
హైదరాబాద్ నగర ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్సార్టీసీ) కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. రూ.600తో ఏడు రోజుల పాటు నగర బస్సుల్లో అపరిమితంగా ప్రయాణించే వీక్లీ పాస్‌ను ప్రవేశపెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ బస్సుల్లో ఈ పాస్ ఉపయోగించుకోవచ్చు. ఏసీ సిటీ బస్సుల్లోనూ ప్రయాణించే అవకాశం ఉంది. అయితే పుష్పక్ ఎయిర్పోర్ట్ లైనర్ బస్సులకు ఈ పాస్ వర్తించదు. ప్రతి ప్రయాణానికి విడిగా టికెట్ కొనాల్సిన అవసరం లేకుండా, వరుసగా ఏడు రోజుల పాటు ఎన్నిసార్లయినా ప్రయాణించవచ్చు. ఉద్యోగులు, రోజూ బస్సుల్లో రాకపోకలు సాగించేవారు, హైదరాబాద్‌కు వారం రోజుల పాటు వచ్చే పర్యాటకులు, వ్యాపార సందర్శకులకు ఈ పాస్ ఉపయోగపడనుంది.
బస్ పాస్ కౌంటర్లలో అందుబాటులోకి
ఇప్పటికే అమల్లో ఉన్న రోజువారీ, నెలవారీ బస్ పాస్‌లకు అదనంగా ఈ వారపు పాస్‌ను టీజీఎస్సార్టీసీ అందుబాటులోకి తెచ్చింది. తక్కువ రోజుల పాటు నగరంలో ఉండేవారికి ఇది అనుకూలంగా ఉంటుందని సంస్థ అధికారులు తెలిపారు. నగరంలోని బస్ పాస్ కౌంటర్లలో ఈ పాస్‌ను కొనుగోలు చేయవచ్చు. ప్రజా రవాణా వినియోగాన్ని పెంచడం, ప్రయాణ ఖర్చులను తగ్గించడం, ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించడం ఈ నిర్ణయం లక్ష్యమని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి తెలిపారు. రోజువారీ ప్రయాణాలకు తరచూ టికెట్లు కొనాల్సిన ఇబ్బంది తగ్గడంతో పాటు, వారం రోజుల పాటు హైదరాబాద్‌లో తిరిగేవారికి ఖర్చుల విషయంలో వెసులుబాటు లభించనుంది
#TGRTC #TGSRTC #WeeklyBusPass #HyderabadBuses #HyderabadTransport #BusPass #UnlimitedTravel #TelanganaRTC #PublicTransport #HyderabadNews #TravelPass #TelanganaNews











