Home AP నేడు పసుపు కండువా.. నిన్న వైసీపీ జెండా!

నేడు పసుపు కండువా.. నిన్న వైసీపీ జెండా!

అభివృద్ధి అజెండానా.. రాజకీయ డ్రామానా?

నిన్నటి వరకు వైసీపీ జెండా పట్టుకుని మున్సిపల్‌ పీఠం కోసం బరిలోకి దిగిన షేక్‌ కరీమూన్‌.. తెల్లారేసరికి పసుపు కండువా కప్పేసుకున్నారు! చిలకలూరిపేట రాజకీయాల్లో ఇదేం ట్విస్టమ్మా! నిన్నటి పార్టీపై నమ్మకం ఏమైంది? నేటి పార్టీపై ప్రేమ ఎప్పుడు పుట్టుకొచ్చింది? ఎన్నికల బరిలో దిగిన తర్వాతే అభివృద్ధి కనిపించిందా? లేక రాజకీయ లెక్కలు కొత్త దారి చూపించాయా? పార్టీ మారగానే అభివృద్ధి మంత్రం అందుకోవడం రాజకీయాల్లో పాత పాటే! కానీ ఓటు అడిగే నాయకులు పార్టీలు మారినప్పుడు, ఓటర్లు మాత్రం ఎవరిని నమ్మాలి? ప్రత్తిపాటి పుల్లారావు అభివృద్ధిని చూసే టీడీపీలో చేరానంటున్న కరీమూన్‌ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశం. కండువా మారింది.. కారణం అభివృద్ధి అంటున్నారు!


చిలకలూరిపేట రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ తరఫున మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన షేక్‌ కరీమూన్‌.. ఇప్పుడు టీడీపీ గూటికి చేరారు. ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. నిన్నటివరకు వైసీపీ తరఫున మున్సిపల్‌ పీఠం కోసం సిద్ధమైన నాయకురాలు.. నేడు టీడీపీ శిబిరంలో కనిపించడంతో స్థానిక రాజకీయాల్లో చర్చ మొదలైంది. పార్టీ మార్పు వెనుక రాజకీయ లెక్కలున్నాయా? లేక అభివృద్ధే అసలు కారణమా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మరి నిన్నటి నినాదాల మాటేమిటో!

టీడీపీలో చేరిన సందర్భంగా కరీమూన్‌ తన నిర్ణయానికి అభివృద్ధే కారణమని చెప్పారు. ప్రత్తిపాటి పుల్లారావు చేపడుతున్న పనులను చూసి, చిలకలూరిపేట సమగ్ర అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆయన నాయకత్వంలో నియోజకవర్గం ముందుకు సాగుతోందని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. రాజకీయాల్లో పార్టీ మార్పులు కొత్త కాకపోయినా, ఒక పార్టీ తరఫున చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా నిలిచిన తర్వాత మరో పార్టీలో చేరడం మాత్రం చర్చకు తావిస్తోంది. నిన్నటి పార్టీపై నమ్మకం ఏమైంది? నేటి పార్టీపై విశ్వాసం ఎప్పుడు కుదిరింది? అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి. ఎన్నికల వేళ కండువాలు మారుతున్నాయి.. కారణాలు మాత్రం అభివృద్ధి చుట్టూనే తిరుగుతున్నాయి!

 

#ShaikKarimoon #Chilakaluripet #TDP #YSRCP #PrathipatiPullaRao #PartySwitch #MunicipalElections #ChairpersonCandidate #AndhraPradeshPolitics #LocalBodyElections #PoliticalDevelopments #DevelopmentAgenda