Home AP గుట్టురట్టవుతోంది! సీబీఐ దర్యాప్తుకు ఎందుకు భయం?

గుట్టురట్టవుతోంది! సీబీఐ దర్యాప్తుకు ఎందుకు భయం?

రోజురోజుకూ కొత్త ఆధారాలొస్తున్నాయ్.
డీఎస్సీపై జగన్‌ సంచలన ఆరోపణలు.

డీఎస్సీ–2025 నియామకాలపై రోజురోజుకూ కొత్త ఆధారాలు, వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ ఆరోపించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బయటకు వస్తున్న అంశాలు నియామకాల్లో తీవ్ర అక్రమాలు జరిగాయనే అనుమానాలను బలపరుస్తున్నాయని ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పడంతో పాటు నిజానిజాలు తేల్చేందుకు సీబీఐ దర్యాప్తుకు అంగీకరించాల్సి ఉన్నా.. స్వతంత్ర దర్యాప్తును తిరస్కరిస్తోందని విమర్శించారు. అంతేకాదు, డీఎస్సీ వ్యవహారంపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ప్రతిపక్షాలు, మీడియా సంస్థలు, సామాజిక కార్యకర్తలు, వ్యక్తుల సోషల్‌ మీడియా పోస్టులు, ఖాతాలపై మెటా వేదికల్లో ఆంక్షలు విధిస్తున్నారని జగన్‌ ఆరోపించారు. ఫేస్‌బుక్‌లో సాక్షి టీవీ, ఇన్‌స్టాగ్రామ్‌లో సాక్షి డిజిటల్‌, బిగ్‌ టీవీ, జగన్‌అన్న కనెక్ట్స్‌ వంటి ఖాతాలు పరిమితం చేయడం, తొలగించడం, జియోబ్లాక్‌ చేయడం జరుగుతోందని పేర్కొన్నారు.

ప్రశ్నలకు బదులు సెన్సార్‌ ఎందుకంటూ ప్రశ్న

డీఎస్సీ అంశానికే ఈ వ్యవహారం పరిమితం కాలేదని జగన్‌ అన్నారు. ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలు, సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ హామీల అమలు, అధికార దుర్వినియోగంపై ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు. “ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రశ్నించే గొంతులను అణచివేయడం పాలన కాదు.. సెన్సార్‌షిప్‌” అంటూ మండిపడ్డారు. భావప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కని గుర్తుచేశారు. డీఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరిగాయని ప్రభుత్వం భావిస్తే తక్షణమే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించి నిజాలు తేల్చాలని చంద్రబాబుకు సవాల్‌ విసిరారు. పోస్టు తొలగిస్తే ఆధారం మాయమవదని, ఖాతా బ్లాక్‌ చేస్తే నిజం మరుగున పడదని వ్యాఖ్యానించారు.

టీచర్‌ పోస్టులపై కీలక ప్రశ్నలు

కొంతమందికి డీఎస్సీ పరీక్ష రాయకుండానే, టెట్‌ ఉత్తీర్ణత లేకుండానే టీచర్‌ ఉద్యోగాలు ఇచ్చారంటూ జగన్‌ ఆరోపించారు. స్పోర్ట్స్‌ కోటా నియామకాల కోసం జీఓలు జారీ చేసి, నియామకాలు పూర్తయ్యాక వాటిని రద్దు చేసినా ఆ జీఓల ద్వారా నియమితులైన వారు మాత్రం ఉద్యోగాల్లో కొనసాగుతున్నారని ప్రశ్నించారు. ముందుగా నియామకాలకు మార్గం తెరిచి, తర్వాత గేట్లు మూసేశారంటూ విమర్శించారు. ఈ అంశాలన్నింటిపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. డీఎస్సీ–2025లో అవకతవకలు లేవని ప్రభుత్వం నమ్మితే స్వతంత్ర సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతోందని నిలదీశారు.

లోకేశ్‌ రాజీనామాకు జగన్‌ డిమాండ్‌

డీఎస్సీ నియామకాల్లో ఆరోపణలు, వివాదాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలని జగన్‌ డిమాండ్‌ చేశారు. పరిమితం చేసిన సోషల్‌ మీడియా ఖాతాలు, పోస్టులు, కంటెంట్‌ను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. ప్రశ్నించే గొంతులను అణచివేయడం ఆపాలని, ఆరోపణలకు సమాధానాలు ఇవ్వాలని, సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. చివరగా చంద్రబాబును ఉద్దేశించి “ఏం భయపడుతున్నారు.. ప్రశ్నలకా? సమాధానాలకా?” అంటూ జగన్‌ తన ఎక్స్‌ పోస్టులో సూటిగా ప్రశ్నించారు. అయితే జగన్‌ చేసిన ఈ ఆరోపణలు రాజకీయ విమర్శలుగా ఉండగా, వాటి వాస్తవికతపై స్వతంత్ర దర్యాప్తులోనే స్పష్టత రావాల్సి ఉంది.

 

#DSC2025 #DSCControversy #DSC2025CBIProbe #JaganMohanReddy #YSJagan #NaraLokesh #DSCRecruitment #TeacherRecruitment #APTeachers #CBIProbe #DSCIrregularities #TET #SportsQuota #ChandrababuNaidu #AndhraPradeshPolitics #YSRCP