గాడి తప్పిన ప్రభుత్వాస్పత్రులు
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం?
వైద్యం పడకేసిందన్న హరీశ్ రావు
తెలంగాణలో ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ఒకప్పుడు తనను విమర్శించిన వారే ఇప్పుడు “అప్పుడే పరిస్థితి బాగుండేది” అని గుర్తు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య సేవలు అందించే తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) కమిషనర్ లేక గాలిలో దీపంలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
184 ఆస్పత్రులు అయోమయంలో
గత రెండు నెలలుగా పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడంతో టీవీవీపీ పరిధిలోని ఎంసీహెచ్‌లు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కలిపి మొత్తం 184 ఆస్పత్రుల నిర్వహణ దెబ్బతిన్నదని హరీశ్‌రావు ఆరోపించారు. వైద్య సేవలు, వైద్యుల హాజరు, ల్యాబ్ పరీక్షలు, మందుల లభ్యతపై పర్యవేక్షించే వ్యవస్థ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వైద్య సిబ్బంది సమస్యలు కూడా పేరుకుపోతున్నాయని పేర్కొన్నారు.
పూర్తికాని విలీనం.. పెరిగిన సమస్యలు
వైద్య సిబ్బంది వేతనాలు, సేవా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తమ ప్రభుత్వ హయాంలో టీవీవీపీని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మార్చి ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించామని హరీశ్‌రావు గుర్తు చేశారు. మూడు సంవత్సరాలు గడిచినా సేవా నిబంధనలు రూపొందించకపోవడం వల్ల లక్ష్యం నెరవేరలేదని అన్నారు. ఉద్యోగులు పలుమార్లు విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం స్పందించలేదని, నిరసనలు చేపట్టినా పట్టించుకోలేదని విమర్శించారు.
ప్రభుత్వానికి హరీశ్ డిమాండ్
వైద్యులు, సిబ్బంది సమస్యలతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఏర్పాటుకు తక్షణమే కమిటీ నియమించి సేవా నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించాలని కోరారు. అలాగే టీవీవీపీకి వెంటనే పూర్తిస్థాయి అధికారిని నియమించి ఆస్పత్రుల నిర్వహణను గాడిలో పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కొనసాగితే వైద్య సేవలపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని హరీశ్‌రావు హెచ్చరించారు.
#HarishRao #TelanganaGovernmentHospitals #TelanganaHealthcare #GovernmentHospitals #TVVP #TelanganaVaidyaVidhanaParishad #TelanganaHealth #HealthcareCrisis #TelanganaPolitics #BRS #HarishRaoNews #GovernmentHospitalIssues #TelanganaNews #HealthDepartment











