వచ్చే ఐపీఎల్ 2027 సీజన్‌ను వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కాస్త ముందుగానే నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి కసరత్తు చేస్తోంది. ఐపీఎల్ తదుపరి సీజన్‌ను మార్చి 10 నుండి మే 15 లోపు ముగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. మే నెల చివరి వారంలో ఎండల తీవ్రత పెరగడం, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఆటగాళ్లు, ప్రేక్షకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
మ్యాచ్‌ల సంఖ్య పెంపుపై ప్రస్తుతానికి లేదు
ఐపీఎల్ గవర్నింగ్ బాడీతో చర్చించి వాతావరణం అనుకూలంగా ఉండేలా షెడ్యూల్ రూపొందిస్తున్నామని సైకియా తెలిపారు. ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడటమే తమ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఇకపోతే ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్యను 74 నుండి 94కు పెంచుతారనే వార్తలపై ఆయన స్పష్టత ఇచ్చారు. విదేశీ ఆటగాళ్ల లభ్యత, ఇతర దేశాల ద్వైపాక్షిక సిరీస్‌ల వల్ల మ్యాచ్‌ల సంఖ్య పెంపుపై ప్రస్తుతానికి ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు.











