Home AP బలమున్న చోట పోటీ వందశాతం గెలుపే లక్ష్యం

బలమున్న చోట పోటీ వందశాతం గెలుపే లక్ష్యం

స్థానిక పోరుకు జనసేన సమరశంఖం!

స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన శ్రేణులు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. జనసేన స్థానిక సంస్థల ఎన్నికల అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పార్టీకి బలం ఉన్న ప్రాంతాల్లో తప్పకుండా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు ఈసారి నేరుగా జరుగుతాయని తెలిపారు. గతంలో మాదిరిగా సభ్యులంతా కలిసి ఒకరిని ఎన్నుకునే విధానానికి స్వస్తి పలికినట్లు చెప్పారు. ఎన్నో పోరాటాలు చేసి జనసేన ఈ స్థాయికి చేరిందన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ఎన్నికల్లో ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. పంతాలకు పోకుండా జనసేన బలమున్న ప్రాంతాలను గుర్తించి వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని నేతలకు సూచించారు. పార్టీ సభ్యత్వ నమోదులో కీలకంగా పనిచేసిన వారికి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. భవిష్యత్తులో జనసైనికులే మేయర్లు, ఛైర్మన్లు, వార్డు సభ్యులుగా గెలిచే అవకాశం ఉందని, ఇందుకు పార్టీ క్రమశిక్షణ పాటించాలని సూచించారు.

ప్రతి ఓటుపైనా జనసేన ఫోకస్

స్థానిక ఎన్నికల్లో వంద శాతం ఫలితాలే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఓటు కీలకమని, ప్రతి గడపకూ వెళ్లాలని ఆదేశించారు. జనసేన సభ్యత్వం ఉన్నవారినే అభ్యర్థులుగా ఎంపిక చేయాలని సూచించారు. ఈనెల 15న మంగళగిరికి పవన్ కల్యాణ్ వస్తారని, స్థానిక ఎన్నికల సన్నాహాలపై సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. 12న, 15న కూటమి సమన్వయ కమిటీ సమావేశాలు జరుగుతాయని చెప్పారు. వైసీపీ నేతలు హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మనోహర్ మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో దాడులను ఎదుర్కొన్నామని గుర్తుచేశారు. పార్లమెంట్ పరిధిలోని నేతలు ముందుగానే సమావేశమై సమన్వయంతో పనిచేయాలని సూచించారు. యలమంచిలి, నర్సీపట్నంలో జనసేనకు బలమైన పట్టు ఉందని, కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయని తెలిపారు.

 

#JanaSena #JanaSenaParty #NadendlaManohar #PawanKalyan #LocalBodyElections #APLocalElections #JanaSenaElections #JanaSenaStrategy #JanaSenaCadre #JanaSenaCandidates #JanaSenaMembership #LocalPolls #MunicipalElections #CorporationElections #JanaSenaStrongholds #EveryVoteMatters #100PercentVictory #Yelamanchili #Narsipatnam #Kakinada #AndhraPradeshPolitics #APPolitics #JanaSenaNews